వలసలను తక్షణం ఆపాలి 

1 Apr, 2020 03:00 IST|Sakshi

కరోనాపై 24 గంటల్లోగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలి

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిపై ఫేక్‌ న్యూస్‌తో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా నివారించాలని, కచ్చితమైన సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ అనంతరం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి ఇళ్లకు మరలడంపై దాఖలైన రెండు పిల్‌లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌  బాబ్డే, జస్టిస్‌ నాగేశ్వరరావుల బెంచ్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ధర్మాసనం..‘శిక్షణపొందిన కౌన్సెలర్లను రప్పించి షెల్టర్‌ హోమ్‌లలో ఉన్న వలస కార్మికుల్లో ఆందోళనను పోగొట్టాలి. పోలీసులకు బదులుగా వలంటీర్లకే షెల్టర్ల నిర్వహణ బాధ్యతలు చూడాలి. కార్మికులకు పరీక్షలు చేపట్టి, అవసరమైతే క్వారంటైన్‌లో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేంద్రం.. సత్వర చర్యలతో దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేశామని, ఫేక్‌న్యూస్‌ కారణంగా ప్రజల్లో తలెత్తిన భయాందోళనలతో పరిస్థితులు నియంత్రించలేనంతగా చేయిదాటి పోయాయని తెలిపింది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ జాడలు కనిపించలేదని, నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రతి 10 మంది వలస కార్మికుల్లో ముగ్గురు సొంతూళ్లకు వెళ్లడంతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు.

ఉచితంగా కోవిడ్‌ పరీక్షకు ఆదేశించండి 
దేశంలోని పౌరులందరికీ కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ పరీక్ష ఉచితంగా చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఉచితంగా పరీక్ష చేసేలా కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ లాయర్‌ శశాంక్‌ డియో సుధి పిటిషన్‌ దాఖలు చేశారు. తమకున్న రోగాన్ని నిర్ధారణ చేసుకొనేందుకు సాధారణ పౌరులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే అక్కడ భారీగా ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని స్పష్టంచేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా