చనిపోయిన స్వామి బతికొస్తారని భక్తుల హడావిడి

13 Mar, 2014 15:50 IST|Sakshi
చనిపోయిన స్వామి బతికొస్తారని భక్తుల హడావిడి

ఇంతకీ ఆయన బతికున్నట్టా? లేనట్టా? కోర్టులు ఆయన చనిపోయారని అంటూంటే, భక్తులు మాత్రం గురువుగారు సమాధిలో ఉన్నారు. కాస్సేపట్లో లేచి వస్తారని వాదిస్తున్నారు. ఆరు వారాలుగా ఆయన భౌతిక కాయాన్ని ఎవర్నీ ముట్టనీయడం లేదు. పోలీసులు, సర్కారు స్వాములోరి సంగతేమి చేయాలో తెలియక తికమకపడుతున్నారు.

పంజాబ్ లోని నూర్ మహల్ అనే కుగ్రామాన్ని కేంద్రంగా చేసుకుని దేశ విదేశాల్లో దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్ అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతున్న అశుతోష్ మహారాజ్ ఆరు వారాల క్రితం జనవరి 29న గుండెపోటుతో చనిపోయారు. ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించేశారు. కానీ భక్తులు మాత్రం ఆయన బతికే ఉన్నారని, ప్రస్తుతం సమాధి స్థితిలో ఉన్నారని వాదిస్తున్నారు. అంతే కాదు, కళ్లు మూసుకుంటే చాలు ఆయన కనిపించి సందేశాలు పంపుతున్నారని కూడా చెబుతున్నారు. 'నా శరీరాన్ని కాపాడండి. నేను త్వరలో వస్తున్నాను' అని కూడా చెబుతున్నారట. అందుకే ఆయన్ని శవాలను ఉంచే ఫ్రీజర్ లో భద్రపరిచి ఉంచారట.

ప్రభుత్వం, పోలీసులు శవానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. భక్త సమూహం మాత్రం ఏమాత్రం పడనీయడం లేదు. అశుతోష్ మహారాజ్ కి దేశ విదేశాల్లో భక్తులున్నారు. ఆయన ఆశ్రమాలు అన్ని చోట్లా ఉన్నాయి. ఒక పదిహేనేళ్ల క్రితం పశ్చిమబెంగాల్ లో వామపక్షాలకు సన్నిహితుడైన బాలక్ బ్రహ్మచారి విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చనిపోయిన 60 రోజుల వరకూ భౌతికకాయాన్ని అలాగే వుంచి, స్వామి వారు వస్తారని భక్తులు భజనలు చేశారు. చివరికి ఓ రాత్రి పోలీసులు రంగప్రవేశం చేసి అంతిమ సంస్కారాలు చేసేశారు. ఇవన్నీ చూస్తుంటే 'ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా' అనుకోవాల్సిందే కదూ!!

మరిన్ని వార్తలు