మరో నకిలీ వీడియో హల్‌చల్‌!

9 May, 2019 15:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో భగవద్గీత పంచుతున్న ఇస్కాన్‌ సభ్యులను కొడుతున్న పోలీసులంటూ ఓ వీడియో ఆన్‌లైన్‌ గత రెండు రోజులుగా వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను ‘వియ్‌ సపోర్ట్‌ నరేంద్ర మోదీ’ గ్రూప్‌ ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో షేర్‌ చేస్తోంది. ఇదే వీడియో ఇంతకుముందు 2018, ఏప్రిల్‌ నెలలో వైరల్‌ అయింది. గోవాలో ఇస్కాన్‌ సభ్యులపై క్రైస్తవులు దాడి చేసినప్పటి వీడియో అంటూ నాడు ప్రచారం అయింది. వాస్తవానికి ఈ వీడియో 2008, నవంబర్‌ 26వ తేదీన ‘హెరాల్డ్‌గోవా డాట్‌ ఇన్‌’ వచ్చిన వార్తకు సంబంధించినది. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించినందున ఆ సైట్‌లో వీడియో దొరకలేదుగానీ ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వార్త, దానికి సంబంధించిన ఫొటో వెలుగు చూసింది. ఆన్‌లైన్‌లో నకిలీ వార్తలను ఎప్పటికప్పుడు వెతికి పట్టుకునే ‘ఆల్ట్‌ న్యూస్‌’ దీన్నీ వెతికి పట్టుకుంది.

కాషాయ వస్త్రాలు ధరించిన ఓ రష్యా బృందం పెద్ద పెట్టున డోలక్, హార్మోనియంను వాయిస్తూ హరేరామా, హరేకృష్ణ అని పాడుకుంటూ వెళుతుండగా, చాలా సేపు ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి త్వరత్వరగా రోడ్డు పక్కగా వెళ్లాల్సిందిగా ఆ రష్యా బృందాన్ని ఆదేశించారు. దాంతో ఆ బృందం సభ్యులు పోలీసులతో కొట్లాటకు దిగారు. దానికి సంబంధించిన వీడియోనే. ఆ వీడియోలో కనిపిస్తున్నది నల్లగా ఉండే అచ్చమైన గోవా పోలీసులని స్పష్టంగా తెలుస్తోంది. అలా తెలియకుండా ఉండేందుకు పోలీసుల ముఖాలను కాస్త మార్ఫింగ్‌ చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో మే 12, మే 19న జరగనున్న మరో రెండు విడతల పోలింగ్‌లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను పోస్ట్‌ చేసినట్లున్నారు. నాడు ఈ సంఘటన జరిగినప్పుడు గోవాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే.

మరిన్ని వార్తలు