శ్రామిక్‌ రైళ్లను అనుమతించిన పశ్చిమ బెంగాల్‌!

9 May, 2020 13:07 IST|Sakshi

అమిత్‌ షా లేఖ..  ఎనిమిది రైళ్లలో రాష్ట్రానికి వలస కార్మికులు

కోల్‌కతా: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు రాష్ట్రానికి వచ్చేందుకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి రావాలనుకుంటున్న వలస కార్మికుల కోసం ఎనిమిది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాల్సిందిగా రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసింది. కాగా వలస కార్మికుల తరలింపు విషయంలో పశ్చిమ బెంగాల్‌ సర్కారు కేంద్రానికి సహకరించడం లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ శనివారం రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీరు మారకుంటే వలస కార్మికుల కష్టాలు రెట్టింపు అవుతాయని.. శ్రామిక్‌ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులను ఆహ్వానిస్తూ మమత సర్కారు వెంటనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.(‘రైళ్లను అనుమతించడం లేదు.. ఇది అన్యాయం’)

ఇక ఈ విషయం గురించి కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. వలస కార్మికుల తరలింపు విషయంలో చొరవ చూపాల్సిందిగా గురువారమే అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశానన్నారు. ఇందుకు స్పందించిన ఆయన.. పశ్చిమ బెంగాల్‌కు ఎన్ని రైళ్లు కేటాయించాలని స్థానిక ప్రభుత్వాన్ని కోరగా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని చెప్పినట్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా మమత సర్కారు ఈ విషయం స్పందించడం లేదని అమిత్‌ షా అన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో శనివారం అధీర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రైళ్లను ఏర్పాటు చేయమని కేంద్రాన్ని అడిగినట్లు తనకు సమాచారం అందిందన్నారు. (స్వస్థలాలకు పంపండి.. మహాప్రభో!)

మరిన్ని వార్తలు