శకటాల తిరస్కరణ కుట్ర: సేన, తృణమూల్‌

3 Jan, 2020 03:30 IST|Sakshi

ముంబై/కోల్‌కతా: రిపబ్లిక్‌డే పరేడ్‌లో తమ శకటాలని ప్రదర్శించాలన్న మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వ ఆశలని కేంద్రం నీరుగార్చింది. వివిధ కారణాలు చూపుతూ ఆ రాష్ట్ర శకటాలని తిరస్కరించింది. 2020 గణతంత్ర దినోత్సవ కవాతులో మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వాల శకటాలని అనుమతించబోమని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్‌ దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని, అదేమిటో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండిఉంటే రాష్ట్ర బీజేపీ ఇలాగే మౌనంగా ఉండేదా’అని సంజయ్‌ ప్రశ్నించారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ సుప్రియా సూలే ఈ విషయంలో కేంద్రాన్ని నిందించారు.

కేంద్రం చర్య మహారాష్ట్ర, బెంగాల్‌ ప్రభుత్వాలకు అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మహారాష్ట్ర, బెంగాల్‌ రెండూ కీలక పాత్ర పోషించాయని, స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇరు రాష్ట్రాల ప్రజలను, అమరవీరులను ఈ చర్య ద్వారా కేంద్రం అవమానించింది’అని కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి సంజయ్‌ దత్‌ అన్నారు. శకటాల ప్రదర్శన తిరస్కరణపై బెంగాల్‌ ప్రభుత్వం స్పందించింది. బెంగాల్‌పై కేంద్రం వివక్షతతో వ్యవహరిస్తోందని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించినందున రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని తృణమూల్‌ ఎంపీ సౌగతా రాయ్‌ అన్నారు. నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినందునే బెంగాల్‌ శకటాన్ని తిరస్కరించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు