దీదీకి దిలీప్‌ ఘోష్‌ సవాల్‌

28 May, 2020 15:47 IST|Sakshi

తృణమూల్‌ సర్కార్‌పై ఫైర్‌

కోల్‌కతా : బెంగాల్‌లో తృణమూల్‌ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను తాను అనుసరించబోనని బెంగాల్‌ బీజేపీ చీఫ్‌, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ స్పష్టం చేశారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తనపై ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని ఆయన సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో అంఫన్‌ తుపాన్‌ బాధిత ప్రజలకు సాయపడేందుకు ముందుకొచ్చే బీజేపీ నేతలు, కార్యకర్తలను తృణమూల్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఘోష్‌ ఆరోపించారు. తుపాన్‌ బాధితుల సాయానికి పునరవాస కార్యకలాపాల్లో పాల్గొనే బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ సామాగ్రిని అందించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగితే జరిగే తీవ్ర పరిణామాలకు దీదీ సర్కార్‌ బాధ్యత వహించాలని ఘోష్‌ హెచ్చరించారు. ముఖ్యమంత్రి, పాలక పార్టీ నేతలు, మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నా ఏ ఒక్కరూ వారిని ఆపడం లేదని ఆరోపించారు.

చదవండి : లాక్‌డౌన్‌: మమత సర్కారు కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు