అసెంబ్లీ గేట్లకు తాళాలు : గవర్నర్‌ ఫైర్‌

5 Dec, 2019 11:50 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ గేటు వద్ద గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ నిరసనకు దిగారు. తాను వస్తున్న సమయంలో గవర్నర్‌, ఇతర వీవీఐపీలకు ఉద్దేశించిన గేటు మూసివేశారని, తెరిచి ఉన్న ఓ గేటు ద్వారా తాను లోపలికి వెళ్లాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ సెక్రటేరియట్‌ ఏడాదంతా పనిచేస్తుందని, అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదంటే సెక్రటేరియట్‌ మూసివేశారని అర్ధం కాదని చెప్పారు. అసెంబ్లీ గేట్లు ఎందుకు మూసివేశారని ప్రశ్నించిన గవర్నర్‌ అసెంబ్లీ ప్రాంగణంలోనే విలేకరుల సమావేశం నిర్వహించారు. చారిత్రక కట్టడాన్ని సందర్శించి లైబ్రరీని పరిశీలించాలని తాను ఇక్కడకు వచ్చానని అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలోనూ సెక్రటేరియట్‌ అంతా యథావిధిగా పనిచేయాలని చెప్పారు.

కాగా గవర్నర్‌ జగదీప్‌ అసెంబ్లీకి వచ్చిన సమయంలో ఒకటో నెంబర్‌ గేట్‌ మూసివేయడంతో గేట్‌ నెంబర్‌ 2 నుంచి ఆయన లోపలికి వెళ్లారు. కాగా అసెంబ్లీకి వచ్చి అక్కడి లైబ్రరీని సందర్శిస్తానని స్పీకర్‌ బిమన్‌ బెనర్జీకి బుధవారం తాను లేఖ రాయగా తనను లంచ్‌కు కూడా ఆహ్వానించారని గవర్నర్‌ చెప్పారు. ఇంతలోనే అసెంబ్లీ సమావేశాలను రెండు రోజుల పాటు వాయిదా వేశారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడితే కార్యాలయాలను మూసివేసి గేట్లకు తాళాలు వేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు.

మరిన్ని వార్తలు