కోలకతా హైకోర్టు అసాధారణ తీర్పు

25 Apr, 2018 13:55 IST|Sakshi
వాట్సాప్‌ ఫోటో( ఫైల్‌)

సాక్షి: కోలకతా: కోలకతా హైకోర్టు  సంచలన ఆదేశాలు జారీ చేసింది. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం వాట్సాప్‌లో దాఖలు చేసిన  తొమ్మిది ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చెల్లుతాయంటూ  తొలిసారి  అపూర్వమైన ఆదేశాలిచ్చింది.  ఈ మేరకు వాట్సాప్‌లో దాఖలు చేసిన నామినేషన్లను ఆమోదించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జస్టిస్ సుబ్రతా తాలూక్‌దార్‌  మంగళవారం ఈ కీలక అదేశాలు జారీ చేశారు.  దీనిపై తదుపరి వాదనలను ఏప్రిల్‌ 30వ తేదీకి వాయిదా వేశారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు  ఏప్రిల్‌ 28.

2018 సంవత్సరానికి పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల సందర్భంగా  ఈ సంఘటన చోటు చేసుకుంది.  తాము నేరుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేయలేకపోయామని, అందుకే వాట్సాప్ ద్వారా పంపించామని పిటిషనర్లు వాదించారు. ఆఫీస్ దగ్గర తమను  గంటల కొద్దీ వేచి చూసేలా చేశారని, ఆ తర్వాత కొందరు తమపై దాడి చేసి డాక్యుమెంట్లను లాక్కున్నారని   ఆరోపించారు.    నిజానికి నామినేషన్లు వేయకుండా కొందరు తమని అడ్డుకున్నారని  పిటిషనర్లలో  ఒకరైన శర్మిష్ట   చౌదరి కోర్టుకు తెలిపారు.  అందుకే  తప్పని పరిస్థితుల్లో తాము వాట్సాప్‌లో  సమర్పించాల్సి వచ్చిందని వివరించారు.   దీనిపై వాదనలు విన్న కోర్టు ఈ తొమ్మిదిమంది అభ్యర్థుల  నామినేషన్ పత్రాలను  అంగీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే ఇది అసాధారణ పరిస్థితుల్లో, ఒక అసాధారణ పరిష్కారంగా  కోర్టు ఇచ్చినతీర్పు తప్ప.. ప్రతిసారి ఇలా వాట్సాప్‌లో నామినేషన్లు ఆమోదించే పరిస్థితి ఉండదని   సీనియర్ న్యాయవాది,  మాజీ రాష్ట్ర న్యాయవాది జయాంత మిత్రా  వ్యాఖ్యానించారు. వ్యక్తి  ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు ఉల్లంఘన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులకు సంబంధించిన  ఉత్తర్వుగా రాజ్యాంగ నిపుణుడు, సీనియర్ లాయర్ అరవింద్ దత్తార్  అభివర్ణించారు.

మరిన్ని వార్తలు