వైరల్‌ : ప్రాణాలు కాపాడుతానంటున్న యమరాజు

8 Nov, 2019 16:11 IST|Sakshi

ముంబయి : సాధారణంగా మన ప్రాణాలను హరించేందుకు యముడి రూపంలో వస్తాడని మన పురాణాలు చెబుతుంటాయి. కానీ అదే యముడు ప్రాణాలు కాపాడడానికి వస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఇక్కడ చూడండి.  రైల్వే ట్రాక్‌ దాటుతూ ప్రమాదాల భారీన పడుతున్న వారికి అవగాహన కల్పించడానికి పశ్చిమ రైల్వే విభాగం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఒక వ్యక్తికి యముని వేషదారణ వేసి రైల్వే ట్రాక్‌ దాటుతున్న కొంతమందిని ఎత్తుకొని ప్లాట్‌పామ్‌ మీదకు తీసుకువచ్చి ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. పశ్చిమ రైల్వే విభాగం చేసిన వినూత్న ప్రయత్నానికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 

'తరచూ రైల్వే పట్టాలు దాటుతూ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలిసిన విషయమే. వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించడానికే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక మీదట ఎవరు ప్రమాదాల భారీన పడకుండా సబ్‌వే లేదా రైల్వే బ్రిడ్జిని ఉపయోగించేలా ప్రయాణికులను ప్రోత్సహిస్తామని' పశ్చిమ రైల్వే విభాగం ట్విటర్‌లో పేర్కొంది. 'ప్రయాణికులు ప్రమాదాల భారీన పడకుండా పశ్చిమ రైల్వే విభాగం చేస్తున్న వినూత్న కార్యక్రమం చాలా బాగుంది అంటూ' నెటిజన్లు తమ సంతోషాన్నివ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల భారీన పడకుండా కాపాడుతున్న యమరాజు రూపంలో ఉన్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. అయితే గతంలోనూ బెంగుళూరు, గుర్గావ్‌ నగరాల్లో ప్రయాణికులకు రోడ్‌ సేప్టీ అవేర్‌నెస్‌ కల్పించడానికి ఆయా రాష్ట్రాల ట్రాపిక్‌ విభాగం ఇలాంటి వినూత్న కార్యక్రమాలనే చేపట్టింది.

>
మరిన్ని వార్తలు