23మంది మృతి: ఆ తొక్కిసలాటకు కారణం ఇదేనట!

11 Oct, 2017 16:44 IST|Sakshi

సాక్షి, ముంబై: 23 మంది మృతికి కారణమైన ముంబై ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటనకు కారణం భారీ వర్షమేనట.. ఈ మేరకు ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన వెస్ట్రన్‌ రైల్వే (డబ్ల్యూఆర్‌) చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌.. తన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ ఘటనలో గాయపడిన 30మంది ప్రయాణికుల వాంగ్మూలాన్ని సేకరించడంతోపాటు.. ఈ ఘటన వీడియో దృశ్యాలను పరిశీలించిన దర్యాప్తు అధికారి ఈమేరకు నిర్ధారించారని  అధికారులు తెలిపారు.

గత నెల 29న ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న పురాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాట ఘటనలో 23 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 25 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన రోజు భారీ వర్షం పడిందని, ఈ వర్షం వల్ల టికెట్‌ కౌంటర్‌ వద్ద ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి మీదకు రావడంతో అప్పటికీ రద్దీగా ఉన్న ఆ వంతెనపై గందరగోళం ఏర్పడి.. తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకున్నాయని దర్యాప్తు నివేదిక పేర్కొంది.

క్రమంగా ప్రయాణికుల రాక పెరిగిపోవడం కూడా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపై సమస్యను జఠిలం చేసిందని తెలిపింది. అయితే, ఈ ఘటనకు కొందరూ ఊహించినట్టు షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదని ప్రయాణికులు పేర్కొన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ప్రయాణికులు భారీ లగేజ్‌లతో రావడంతో రద్దీలో వారు బ్యాలెన్స్‌ కోల్పోవడం కూడా తొక్కిసలాటకు దారితీసిందని తెలిపింది. రద్దీ వేళల్లో భారీ లగేజ్‌లతో ప్రయాణికులు రాకుండా చూడాలని నివేదిక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి దగ్గరున్న బుకింగ్‌ కార్యాలయాన్ని మార్చాలని, ప్రస్తుతమున్న ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిని విస్తరించడంతోపాటు మరొక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని ఏర్పాటుచేయాలని దర్యాప్తు నివేదిక సూచించింది.

మరిన్ని వార్తలు