కశ్మీర్‌ భూములపై ఎవరికి హక్కు?

31 Oct, 2019 14:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం ఈ రోజు నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అధికారికంగా ఆవిర్భవించిన విషయం తెల్సిందే. ఇంతవరకు కశ్మీర్‌కు మాత్రమే వర్తిస్తున్న ప్రత్యేక భూమి హక్కుల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాలపై కేంద్రానికే ఎక్కువ హక్కులు ఉంటాయి. అందులో భాగంగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాల భూములకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేస్తుందని ఈ రోజు వరకు ఎదురు చూసిన వారు నిరాశకు గురవుతున్నారు. 

రెండుగా విడిపోయిన కశ్మీర్‌ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించే సుందర వనాలవడం, అక్కడ భూములు చాలా చౌక అవడంతో దేశంలోని చిన్న రియల్టర్‌ నుంచి పెద్ద రియల్టర్‌ వరకు ఆ ప్రాంతాలపై కన్నేశారు. రద్దు చేసిన రాజ్యాంగంలోని 35ఏ అధికరణం కింద కశ్మీర్‌లో శాశ్వత నివాసితులే స్థిరాస్తులను కొనుగోలు చేయాలి. ఇతర రాష్ట్రాల వారు కొనుగోలు చేయడానికి వీల్లేదు. కశ్మీర్‌ ఆడ పిల్లల పేరిట భూమి, ఇల్లు లాంటి స్థిరాస్థులుంటే వారు ఇతర రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకుంటే వాటిపై హక్కులను కోల్పోవాల్సి ఉంటుంది. 

ఇప్పుడు ఈ నిబంధనలన్నీ రద్దయ్యాయి కనుక, అందమైన కశ్మీర్‌ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చని, వీలైతే వారి స్థిరాస్తులను అనుభవించవచ్చని ఎంతో మంది యువకులు సోషల్‌ మీడియా సాక్షిగా ఉవ్విళ్లూరారు. భూమి హక్కులు కశ్మీరీలకే దక్కేలా ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల సరళిలో ప్రత్యేక చట్టాలు తీసుకు రావాలని స్థానిక బీజేపీ నాయకులతో సహా పలు పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. (చదవండి: కశ్మీర్‌కు ‘రోడ్‌మ్యాప్‌’ లేదు!)

మరిన్ని వార్తలు