సెప్టెంబర్‌ 1; కాస్త జాగ్రత్తగా ఉండండి!

31 Aug, 2019 17:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు చేశారా? ఎంత ఆలస్యమైనా ఈరోజు ఫైల్‌ చేసేయండి. ఐటీ రిటర్న్‌ ఈ రోజులోపు సమర్పించకపోతే 10 వేల రూపాయల వరకు జరిమానా కట్టాల్సిరావొచ్చు. ఆదాయ పన్నుపై కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు రేపటి నుంచి (సెప్టెంబర్‌ 1) అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు రేపటి నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్‌సీటీసీ సర్వీస్‌ చార్జీలు అమల్లో రానున్నాయి. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. కాబట్టి వేతన జీవులు కాస్త కేర్‌ఫుల్‌గా ఉండ్సాలిందే. రేపటి నుంచి కొత్తగా అమల్లోకి రానున్నవి ఏంటో చూద్దాం.

ఇల్లు కొనుగోలుపై టీడీఎస్‌
ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్‌ను డిపాజిట్‌ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది.  

రూ. కోటి విత్‌డ్రా చేస్తే ‘ఫైవ్‌’ పడుద్ది
ఒక సంవత్సరంలో ఒక అకౌంట్‌ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్‌డ్రాయెల్స్‌ జరిపితే 2 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్‌ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌ విధిస్తారు.

ఐఆర్‌సీటీసీ వడ్డన
ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ‌) ఇ-టికెట్లపై సర్వీసు చార్జీలను పునరుద్ధరించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న నాన్‌ ఏసీ టికెట్‌పై రూ. 15, ఏసీ టికెట్‌పై రూ. 30 సర్వీసు ఛార్జీలను ఐఆర్‌సీటీసీ‌ వసూలు చేయనుంది.

సర్వీస్‌ ట్యాక్స్‌ బకాయిలకు చెక్‌
సేవా పన్ను బాకాయిలను వదిలించుకునేందుకు కొత్త పథకం అమల్లోకి రానుంది. దీని ద్వారా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ ట్యాక్స్‌‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకుని బయటపడొచ్చు.

బీమా డబ్బుకు తప్పదు పన్ను
జీవిత బీమా ప్రీమియం గడువు ముగిసిన తర్వాత తీసుకునే నికర సొమ్ముపై 5 శాతం టీడీఎస్‌ కట్టాల్సి ఉంటుంది.

కొత్త పాన్‌కార్డులు
ఆధార్‌ నంబరుతో పాన్‌కార్డులు లింక్‌ చేయనివారికి ఆదాయపన్ను శాఖ కొత్త పాన్‌కార్డులు జారీ చేయనుంది.

ఉల్లంఘిస్తే బాదుడే
సవరించిన మోటారు వాహనాల చట్టం అమల్లోకి రానుంది. ట్రాఫిక్‌ నియమాలు ఉల్లఘించే వారు భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 25 వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించి డబ్బులు ఆదా చేసుకోవాలని గత కొద్దిరోజులుగా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. (చదవండి: రూల్స్‌ బ్రేక్‌ .. పెనాల్టీ కిక్‌)

షాపింగ్‌.. బ్రీఫింగ్‌
ఇప్పటివరకు 50 వేల రూపాయలకు పైబడి చేసిన షాపింగ్‌ గురించి మాత్రమే ఆదాయపన్ను శాఖకు బ్యాంకులు సమాచారం ఇచ్చేవి. టాక్స్‌ రిటర్న్స్‌లో ఎటువంటి అనుమానం కలిగినా చిన్న ట్రాన్స్‌క్షన్‌ గురించి కూడా బ్యాంకులు ఆరా తీసే అవకాశముంది. (ఇది చదవండి: సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!)

మరిన్ని వార్తలు