ఖైదీలకు టీవీలు, సోఫాలా?

23 Nov, 2018 05:21 IST|Sakshi

తీహార్‌ జైలులో లగ్జరీ సౌకర్యాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: జైళ్లలో ఖైదీలకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘ఖైదీలకు ఎల్‌ఈడీ టీవీలు, సోఫాలు, మినరల్‌ వాటరా? తీవ్ర ఆరోపణలతో అరెస్టయి జైళ్లలో ఉన్న వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారా? జైళ్లలో ఏమైనా సమాంతర వ్యవస్థ నడుస్తోందా?’అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గృహ కొనుగోలుదారులను మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టయి తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న యూనిటెక్‌ ఎండీ సంజయ్‌ చంద్ర, అతని సోదరుడు అజయ్‌ చంద్రలకు లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుం టున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు..
తీహార్‌ జైలులో సౌకర్యాలపై సదరు జైలు అధికారులు సహా జైళ్ల శాఖ డీజీ హస్తం ఉందని భావిస్తున్నట్లు అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి తన నివేదికలో తెలిపారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఖైదీలకు సౌకర్యాలు కల్పిస్తున్న వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నివేదిక సహా పలువురు ఖైదీల లేఖల ఆధారంగా హైకోర్టు దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, జైళ్ల శాఖ డీజీ, పలువురు సీనియర్‌ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై 2019 ఫిబ్రవరి 1లోగా స్పందనను తెలపాలని వారిని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు