అభిశంసన అంటే ఏమిటీ?

20 Apr, 2018 16:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన ఏడుగురు ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా శుక్రవారం నాడు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలుసుకొని ఓ లేఖను అందజేశాయి. ఆ లేఖపై కాంగ్రెస్‌ పార్టీతోపాటు సీపీఎం, సీపీఐ, ఎన్‌సీపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందిన 71 మంది పార్లమెంట్‌ సభ్యులు సంతకాలు చేశారు. ప్రతిపక్షానికి చెందిన డీఎంకే మాత్రం అభిశంసన తీర్మానానికి దూరంగా ఉంది. సీబీఐ ప్రత్యేక జడ్జీ బ్రిజ్‌మోహన్‌ హరికిషన్‌ లోయ అనుమానాస్పద మృతిపై స్వతంత్య్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం నాడు దీపక్‌ మిశ్రా నాయకత్వంతోని సుప్రీం కోర్టు బెంచీ కొట్టివేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి వీలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 124 సెక్షన్‌ కిందనే ఆయన్ని తొలగించవచ్చు. తప్పుడు ప్రవర్తన, అసమర్ధుడు అనే కారణంగా ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సుప్రీం కోర్టుకు చెందిన ఏ జడ్జీనైనా పదవీ విరమణకన్నా ముందే తొలగించాలంటే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం నెగ్గితే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగిస్తారు. అభిశంసన తీర్మానాన్ని ఇరు సభల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించడంతోపాటు ఓటింగ్‌ రోజున ఇరు సభల్లో సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. జడ్జీల (ఇంక్వైరీ) యాక్ట్‌–1969, జడ్జీల (ఇంక్వైరీ) రూల్స్‌–1969 చట్టాల కింద జడ్జీలను తొలగించేందుకు రాజ్యాంగంలోని 124వ అధికరణ వీలు కల్పిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను  అభిశంసనగా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు