వందేమాతరం ‘స్టేటస్‌’ ఏంటి?

1 Apr, 2017 07:58 IST|Sakshi
వందేమాతరం ‘స్టేటస్‌’ ఏంటి?

‘వందేమాతరం’ గేయం... భారత స్వాతంత్య్రపోరాటంలో ముఖ్యభూమికను పోషించింది. స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే భారతీయుల కాంక్షకు భావోద్వేగ భూమికగా నిలిచింది. బంకిమ్‌ చంద్ర చటర్జీ 1876లోనే దీన్ని రాసినా... విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్వరాలు కూర్చి ఆలపించడంతోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1896లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సభలో రవీంద్రుడు వందేమాతరాన్ని ఆలపించారు. అనంతర కాలంలో దేశవ్యాప్తమైంది. దేశభక్తికి, బ్రిటిష్‌ పాలనపై దిక్కారానికి ప్రతీకగా నిలిచింది. వందేమాతరం అని నినదించి ఎందరో జైలు జీవితాలు అనుభవించారు.

1911 డిసెంబరులో ఠాగూర్‌ ‘జనగణమన’ను రచించారు. దీన్ని డిసెంబరు చివర్లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సమావేశాల్లో ఆలపించారు. 1947 ఆగష్టు 14న రాత్రి 11 గంటలకు సమావేశమైన రాజ్యాంగ సభ కూడా అజెండాలో మొదటి అంశంగా వందేమాతరంలోని మొదటి చరణాన్ని ఆలపించింది. ముస్లిం లీగ్‌ అభ్యంతరం మేరకు మొత్తం గీతాన్ని పాడలేదు. సమావేశం చివర్లో జనగణమనను పాడారు. స్వాతంత్య్రం వచ్చాక... వందేమాతరం, జనగణమనల్లో ఏది జాతీయగీతంగా ఉండాలనే చర్చ ప్రారంభమైంది.

రాజ్యాంగ సభ దీనిపై నిర్ణయాన్ని వెలువరించాలి. కాంగ్రెస్‌ ‘జనగణమన’ వైపు మొగ్గింది. కారణం... బహిరంగ రహస్యమే. ముస్లింలను నొప్పింపకూడదని. రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. తీర్మానం ప్రవశేపెట్టి...చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్‌ చేపట్టాలని భావించారు. కానీ ఆ అవసరం రాలేదు. నాటి పెద్దలంతా కలిసి ఒక అవగాహనకు వచ్చారు. దాంతో రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ ఈ ప్రకటన చేశారు...
‘జనగణమన... భారతదేశానికి జాతీయ గీతంగా ఉంటుంది. దేశ స్వాతంత్య్రపోరాటంలో చారిత్రక పాత్రను పోషించిన వందేమాతరం గేయాన్నీ... జనగణమనతో సమానంగా గౌరవించాలి. తప్పకుండా సమాన హోదా ఉండాలి'

రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలేమీ వందేమాతరం గేయానికి లేవు.

డిసెంబరు 23, 1971న జాతీయ చిహ్నలకు అవమానాలను నిరోధించే చట్టాన్ని అప్పటి భారత ప్రభుత్వం తెచ్చింది. రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతాలను అవమానించడకుండా నిరోధించే నిబంధనలను ఇందులో పొందుపర్చారు. జాతీయగీతంతో సమానహోదా ఉండాల్సిన జాతీయ గేయం ‘వందేమాతరం’ ప్రస్తావన ఈ చట్టంలో ఎక్కడా లేదు.

1976లో ర్యాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చారు. వీటిని అర్టికల్‌ 51ఎ... లో పొందుపర్చారు. ‘ప్రతి భారత పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ విలువలను, సంస్థలను, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి’ అని పేర్కొన్నారు. ఇందులోనూ వందేమాతరం ప్రస్తావన లేదు.

జాతీయ గేయమైన వందేమాతరానికి జనగణమనతో సమానహోదా కల్పించాలని, ఆ మేరకు చట్ట సవరణ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ గత ఏడాది నవంబరులో ఢిల్లీ హైకోర్టులో గౌతమ్‌ ఆర్‌ మొరార్కా అనే ఆయన పిల్‌ దాఖలు చేశారు.

పిల్‌ దాఖలైన తర్వాత... ‘ఏయే సందర్భాల్లో వందేమాతరం అలపించాలనే విషయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. వందేమాతరం గేయానికి న్యాయం జరగాలంటే ఈ నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని ప్రభుత్వం నవంబరు 22, 2016న రాజ్యసభకు తెలిపింది.

మొరార్కా పిల్‌పై హైకోర్టు ఇచ్చిన నోటీసుకు ఫిబ్రవరి 8, 2017న కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్రం దాఖలు చేసిన ఆఫిడవిట్‌లో... ‘‘భారతీయుల మదిలో వందేమాతరం గేయానికి విశిష్టమైన స్థానముంది. అయితే జనగణమనతో సమానంగా దీనిని చూడలేం. సృజనాత్మకతను గౌరవించడానికి చట్టపరమైన రక్షణ కల్పించడం ఒక్కటే మార్గం కాదు. దేశానికి ఒకే జెండా, ఒకే జాతీయగీతం ఉంటాయి. అలాగని ఇతర గేయాలు, ప్రార్థనలకు తక్కువ గౌరవం ఇచ్చినట్లు కాదు. తమ మనసుకు నచ్చిన గీతాలు, పుస్తకాలు, చిహ్నాలను గౌరవించుకోకుండా పౌరులెవరినీ నిరోధించినట్లు కాదు’’ అని పేర్కొంది.

వందేమాతరం... పాడనందుకు కౌన్సిలర్ల సభ్యత్వం రద్దు
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ‘వందేమాతరం’పై వివాదం ముదురుతోంది. ఈ నెల 28న (మంగళవారం) కార్పొరేషన్‌ సమావేశంలో సభ్యులందరూ లేచి నిలబడి వందేమాతరం ఆలపించడం మొదలుపెట్టారు. ఏడుగురు ముస్లిం కౌన్సిలర్లు వందేమాతరం ఆలపించడానికి నిరాకరించి.. బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయారు. బుధవారం సమావేశమైన కార్పొరేషన్‌ సభ్యులు... ఈ ఏడుగురు కౌన్సిలర్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.. బీజేపీకి చెందిన మేయర్‌ హరికాంత్‌ అహ్లువాలియా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘మా మతం... షరియా చట్టాలు వందేమాతరాన్ని అంగీకరించవు. రాజీనామా చేయడానికైనా సిద్ధమే... కానీ వందేమాతరం ఆలపించం’ అని కౌన్సిలర్లు దివాన్‌జీ షరీఫ్, షాహిద్‌ అబ్బాసీలు అన్నారు. సభ్యత్వాలను రద్దు చేయడాన్ని తుగ్లక్‌ చర్యగా అభివర్ణించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.  
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు