జీడీపీకి రాహుల్‌ గాంధీ కొత్త అర్థం

6 Jan, 2018 17:15 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ:  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. గబ‍్బర్‌ సింగ్‌ టాక్స్‌ (జీఎస్‌టీ), ఫేక్‌ ఇన్‌ ఇండియా( మేక్ ఇన్ ఇండియా)  అంటూ  విమర్శలు గుప్పించిన రాహుల్‌ నోట్ల రద్దు, జీఎస్‌టీ విధానంపై మరోసారి ధ్వజమెత్తారు. జీడీపీ గ్రాస్ డివైసివ్‌ పాలిటిక్స్(జీడీపీ) )తన దైన శైలిలో వ్యంగ్యంగా అభివర్ణించారు. 2017-18 నాటికి జీడీపీ 6.5శాతంగా ఉండనుందన్నఅంచనాలపై ఆయన ట్విట్టర్‌ లో స్పందించారు.

జైట్లీ మేథస్సు, ప్రధానమంత్రి మోదీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో  భారత ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుందని రాహుల్‌ పేర్కొన్నారు. జీడీపీని  స్థూల విభజన రాజకీయాలు(గ్రాస్‌ డివైసివ్‌ పాలిటిక్స్‌) గా మార్చారని విమర్శించారు. దీంతో పెట్టుబడులు 13 ఏళ్ల కనిష్ఠానికి, బ్యాంకుల పరపతి 63 ఏళ్ల కనిష్ఠానికి, ఉద్యోగ కల్పన సైతం 8 ఏళ్ల కనిష్ఠానికి చేరిందని ఆరోపించారు. వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపు (జీవీఏ) 1.7 శాతానికి దిగజారిందని, అదే సమయంలో ద్రవ్యలోటు 8 ఏళ్ల గరిష్ఠానికి చేరిందని, పెండింగ్‌ ప్రాజెక్టులు సైతం పెరిగాయని ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు.

కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గే అవకాశం ఉందని కేంద్ర గణాంక కార్యాలయం అంచనాలను వెలువరించింది. వ్యవసాయం, తయారీ రంగం పేలవ ప్రదర్శనే ఇందుకు కారణమని పేర్కొంది. 2015-16లో 8 శాతంగా ఉన్న జీడీపీ.. 2016-17లో 7.1 శాతంగా నమోదైంది. ఈ సారి వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ఠానికి చేరుకుంటుందని శుక్రవారం సీఎస్‌ఓ పేర్కొన్న సంగతి తెలిసిందే.


 

>
మరిన్ని వార్తలు