కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?

25 Mar, 2020 14:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కంటికి కనిపించని సూక్ష్మజీవి ధాటికి అగ్రరాజ్యం మొదలు అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి ప్రబలకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఇంతవరకు ఈ ప్రాణాంతక వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొన్న దాఖలాలు లేవు. కొన్ని దేశాలు టీకాను తయారు చేసేందుకు పరిశోధనలు చేస్తున్నా... దానిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కరోనా వైరస్‌ జీవక్రమం.. అది మనిషి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఎటువంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే పరిపూర్ణమైన వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు వీలు అవుతుందని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగతా వైరస్‌లు, కరోనా వ్యాప్తికి గల తేడాల గురించి.. ఈ మహమ్మారి ముఖ్యంగా వృద్ధులపైనే ఎక్కువ ప్రభావం చూపడానికి గల కారణాల గురించి ఓసారి గమనిద్దాం.

కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు నోటి నుంచి వెలువడిన తుంపరల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అయితే దీని లక్షణాలు అంత త్వరగా బయటపడవు. ఈ వైరస్‌ శరీరంలో ప్రవేశించిన దాదాపు 14 రోజుల తర్వాత గొంతు నొప్పి, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతాయి. నిజానికి వైరస్‌లన్నీ అంతఃకణ పరాన్న జీవులే. మనిషి లేదా జంతువులోని శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అందులోని కణాలను నశింపజేసి.. వాటి స్థానంలో తన కణజాలాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. ఒక్కొక్కటిగా కణాల సంఖ్య పెంచుకుంటూ పోతాయి. (కరోనా: ఆలస్యం చేస్తే ఇటలీ, అమెరికాలాగే..)

ఇక కరోనా వైరస్‌ ఆంగీటెన్సిన్‌ కన్వెర్టింగ్‌ ఎంజైమ్‌2(ఏస్‌2) అనే హార్మోన్‌ చుట్టూ ప్రోటీన్‌ మాదిరి సన్నని పొరను ఏర్పరచుకుని దాని గోడల ద్వారా లోపలికి ప్రవేశిస్తుందని ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు వెల్లడించాయి. ఏస్‌ 2 నాడీ వ్యవస్థపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. రక్త నాళాలను కుచింపజేసి రక్త పీడనాన్ని పెంచుతుంది. కరోనా వైరస్‌ ఏస్‌2 గ్రహీతలతో మమేకమై ఒత్తిడిని పెంచుతుంది. సాధారణంగా వైరస్‌ లేదా బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ విషయాన్ని గ్రహించి యాంటీ బాడీస్‌ను సిద్ధం చేస్తుంది. అయితే కరోనా వైరస్‌ను గుర్తించడంలో ఇది విఫలమవడానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. 

అయితే శరీరంలోకి చేరిన వెంటనే ఇది కణాలను పూర్తిగా అంతంచేసి.. తన ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరచుకుని పుంఖానుపుంఖాలుగా డూప్లికేట్లను అభివృద్ధి చేసుకుంటుంది. తద్వారా ఆశ్రిత కణం బద్ధలైపోయి.. రోగ నిరోధక శక్తి క్రమక్రమంగా నశించిపోతుంది. కరోనా వైరస్‌ ఎక్కువగా ఏస్‌2 మందులు వాడే డయాబెటిక్‌, బీపీ పేషెంట్లపై అధిక ప్రభావం చూపుతుంది. వారు వాడే మందులు, కరోనా ప్రభావం వెరసి రక్త నాళాలు ఎక్కువ సంఖ్యలో కుచించుకుపోయే అవకాశం ఉంది కాబట్టే ఈ పేషెంట్లు ముఖ్యంగా వృద్ధులు తొందరగా అస్వస్థతులయ్యే అవకాశాలు ఉన్నాయని జీవకణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. (కరోనా: ‘మీకో ఉపాయం చెప్పనా..’)

ఈ విషయం గురించి జాన్స్‌ హోప్కిన్స్‌ బేవ్యూ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పల్మనాలజిస్ట్‌ పనాగిస్‌ గాలియాసాట్రోస్‌ మాట్లాడుతూ.. ‘‘ఏస్‌2 గ్రహీతలు మనం శరీరంలోని చాలా అవయవాల్లో ఉంటాయి. నాలుక, కిడ్నీ, గుండె, ఆహార వాహిక.. ఇలా అన్నింటిలోనూ విస్తరించి ఉంటాయి. వీటి ప్రభావం తీవ్రంగా ఉన్నపుడు కడుపునొప్పి, డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయి. విచారించదగ్గ విషయం ఏమిటంటే... అత్యంత సున్నితమైన ఊపిరితిత్తుల కణాలపై కూడా ఏస్‌2 గ్రహీతలు విస్తారంగా ఉంటాయి. ఉచ్ఛ్వాస, నిశ్వాసల్లో వాటిది కీలక పాత్ర కాబట్టి.. కరోనా కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దగ్గు ఎక్కువగా రావడం, ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకడం జరుగుతుంది.’’అని పేర్కొన్నారు. 

ఇక సార్స్‌, మెర్స్‌, కరోనా వ్యాప్తికి గల తేడాలను వివరిస్తూ... ‘‘సార్స్‌, మెర్స్‌ లక్షణాలు తొందరగా బయటపడతాయి. కాబట్టి వాటిని సులభంగా అంచనా వేసి వ్యాప్తిని కట్టడి చేయవచ్చు. కానీ కరోనా అలా కాదు. దీని లక్షణాలు బయటపడేలోపే వేగంగా విస్తరించి ప్రాణాలను హరిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు... ఎరిన్‌ సోర్సెల్‌ అనే మైక్రోబయాలజిస్టు మాట్లాడుతూ సాధారణంగా యువతలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని వివరించారు. కాగా కరోనా లక్షణాలు బయటడపడేసరికే వైరస్‌ ప్రభావం తీవ్రతరమవుతుంది. తొందరగా కరోనా లక్షణాలు గుర్తించే వీలు లేనందు వల్లే దక్షిణ కొరియాకు చెందిన ఓ పేషెంట్‌ తను చనిపోయేనాటికి దీనిని దాదాపు 1100 మందికి అంటించారు. అందుకే మనిషి నుంచి మనిషికి వేగంగా వ్యాపించే ఈ వైరస్‌ పట్ల ప్రతీ ఒక్కరూ జాగ్రత్త వహించాలి. సామాజిక దూరం పాటిస్తూ తమను తాము కాపాడుకోవాలి. అందుకే ఈ లాక్‌డౌన్లు, ఎమర్జెన్సీలు. తస్మాత్‌ జాగ్రత్త!

మరిన్ని వార్తలు