ఎన్‌పీఆర్‌ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?

24 Dec, 2019 17:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వెబ్‌డెస్క్‌: దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ నరేంద్ర మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా  జాతీయ ప్రజా రిజిస్టర్‌ (నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌- ఎన్‌పీఆర్​)ను నవీకరించే ప్రక్రియకు... కేంద్ర కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 8500 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎన్‌పీఆర్‌ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అసోం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్‌పీఆర్‌తో పాటు 2021 జనాభా లెక్కల ప్రక్రియ సెప్టెంబరు 2020 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో అసలు ఎన్‌పీఆర్‌ అంటే ఏమిటి... దాని ముఖ్య ఉద్దేశం, ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు, ఎన్‌పీఆర్‌ నుంచి అసోంను ఎందుకు మినహాయించారు తదితర అంశాల గురించి గమనిద్దాం.

ఎన్‌పీఆర్‌ అంటే ఏమిటి?
దేశంలోని ప్రతీ పౌరుడి కచ్చితమైన వివరాలు సేకరించడమే ఎన్‌పీఆర్‌ ముఖ్య ఉద్దేశం. ఎన్‌పీఆర్‌ ప్రకారం... ఏదైనా ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక వ్యక్తి గల ఆరు నెలలుగా నివాసం ఉంటున్నా లేదా మరో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్కడే నివాసం ఉండాలనుకుంటే అతడిని యూజువల్‌ రెసిడెంట్‌(సాధారణ నివాసి)గా పేర్కొంటారు. పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వ నిబంధనలు(రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సిటిజన్స్‌, జాతీయ గుర్తింపు కార్డుల జారీ) 2003లోని వివిధ ప్రొవిజన్లను అనుసరించి... గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్రం తదితర విభాగాల్లో దేశంలోని పౌరుల వివరాలను సేకరిస్తారు. ఎన్‌పీఆర్‌ డేటాబేస్‌లో జనాభా లెక్కలు, పౌరుల బయోమెట్రిక్‌ వివరాలు, ఆధార్‌, మొబైల్‌, పాన్‌ నంబర్లు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటర్‌ ఐడీ వివరాలు.. అదే విధంగా పాసుపోర్టు నంబర్లను నిక్షిప్తం చేస్తారు. అయితే ఇందులో ఆధార్‌ నంబరు వాలంటీరిగా ఇస్తే మాత్రమే తీసుకుంటారు.

ఏయే వివరాలు అడుగుతారు?
ఎన్‌పీఆర్‌ ప్రక్రియలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటి యజమాని, తండ్రి పేరు, తల్లి పేరు, వివాహితులైతే భార్య/భర్త పేరు, లింగం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, జాతీయత, తాత్కాలిక చిరునామా, శాశ్వత చిరునామా, ఈ చిరునామాల్లో ఎంతకాలంగా నివాసం ఉంటున్నారు?, వృత్తి, విద్యార్హతల గురించి ప్రశ్నిస్తారు.

డోర్‌-టూ- డోర్‌ సర్వే ఆధారంగా...
ఎన్‌పీఆర్‌ కోసం.. 2011 జనాభా లెక్కల సేకరణలో భాగంగా 2010లో సేకరించిన డేటాను.. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ఆధారంగా నవీకరించి.. డిజిటలైజ్‌ చేశారు. ప్రస్తుతం 2021 జనాభా లెక్కల ప్రక్రియ ఆధారంగా అసోం మినహా భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఎన్‌పీఆర్‌ను వద్దన్న రాష్ట్రాలు..
ఎన్‌పీఆర్‌, ఎన్‌పీఆర్‌ నవీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం అడ్డుచెప్పింది. సీఏఏపై రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలును తాము ఆమోదించబోమని స్పష్టం చేశారు. ఎన్‌పీఆర్‌ ఆధారంగా ఎన్నార్సీ అమలు ఉంటుందన్న నేపథ్యంలో ఎన్‌పీఆర్‌ ప్రక్రియను తమ రాష్ట్రంలో అనుమతించబోమని తెలిపారు. అదే విధంగా కేరళ, రాజస్తాన్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్‌పీఆర్‌ ప్రక్రియకు సహకరించబోమని స్పష్టం చేశాయి.(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)

అసోంను ఎందుకు మినహాయించారు?
ఎన్‌పీఆర్‌ పూర్తయి, అధికారిక ముద్రణ తర్వాత ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్‌ఆర్‌సీ) రిజిస్టర్‌కు ఆధారంగా చేసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అసోంలో ఇటీవలే ఎన్నార్సీను అమలు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ నిజమైన పౌరుల వివరాలను సేకరించే ఎన్‌పీఆర్‌ ప్రక్రియలో అసోంను మినహాయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అపోహలు వద్దు..
ఎన్‌పీఆర్‌ డేటా పబ్లిక్‌ డొమైన్లలో కనిపించదు. ప్రొటోకాల్‌ను అనుసరించి కొంతమంది ప్రత్యేక యూజర్లకు మాత్రమే ఈ డేటా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు ఎన్‌పీఆర్‌ డేటాను వినియోగించుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పౌరుల వ్యక్తిగత డేటా భద్రతపై అపోహలు వద్దని విఙ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు