శిఖరం అంచున విషాద యాత్ర..

29 May, 2019 02:40 IST|Sakshi

ఎవరెస్టు మరణాలకు కారణమేంటి?..  ప్రకృతి ప్రకోపమా.. మానవ నిర్లక్ష్యమా? 

ఎడ్‌ డ్రోహింగ్‌..
అమెరికాలోని అరిజోనాకు చెందిన వైద్యుడు.. అతడి జీవిత కాల స్వప్నం ఒక్కటే..  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించాలని.. సరిగ్గా రెండ్రోజుల క్రితం.. ఎడ్‌ డ్రోహింగ్‌ ఎవరెస్టు శిఖరాగ్రానికి చాలా దగ్గరగా వచ్చేశాడు.. యాహూ అందామనుకున్నాడు. కానీ అక్కడి పరిస్థితిని చూసి షాక్‌ తిన్నాడు.. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.. కూరగాయల మార్కెట్లా కిటకిటలాడుతోంది.. శిఖరాగ్రంపై పర్వతారోహకులు సెల్ఫీలు తీసుకోవడానికి ఒకరినొకరు తోసుకుంటున్నారు... గట్టిగా చూస్తే.. రెండు టేబుల్‌ టెన్నిస్‌ టేబుల్స్‌ పట్టేంత జాగా ఉంటుందేమో అక్కడ.. ఓ 20 మంది పర్వతారోహకులు.. వారి గైడ్లు.. షెర్పాలు కిక్కిరిసిపోయారు.. దీంతో అందరిలాగే తానూ లైనులో వెయిట్‌ చేయాల్సి వచ్చింది.. చాలా నెమ్మదిగా కదులుతోంది లైను.. దారిలో ఓ మహిళ శవం.. ఎవరెస్టును అధిరోహించి.. తిరిగి వస్తూ.. చనిపోయిందట.. తొక్కేయాల్సిందే.. జస్ట్‌లో మిస్సయ్యాడు.. 

అక్కడి పరిస్థితి చాలా దారుణంగా కనిపించింది..అదొక జూలాగ అనిపించింది. తోటి వారి శవాలు పక్కనే పడి ఉన్నా..పట్టనట్లుగా.. ఎవరికివారు పోతున్నారు.. మానవత్వం అక్కడే గొంతు కోసుకుని మరణించినట్లు అనిపించింది.      – ఎడ్‌ డ్రోహింగ్‌.. 

ఎవరెస్టుపై గత వారం రోజుల్లో 11 మంది చనిపోయారు.. కొందరు తమ కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో.. కొందరు విజయగర్వంతో తిరిగివస్తూ.. అశువులు బాసారు.. ఇందులో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. 1922 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 200 మందికిపైగా చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇక్కడ వారంలోనే ఇంతమంది చనిపోయారు. అలాగని ఈ మరణాలకు కారణం.. మంచు తుపాన్లు కాదు.. అతి వేగంగా వీచే శీతల గాలులు కానే కాదు.. మరేంటి? ఎన్నడూ లేనంత రద్దీనా.. ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఇంకేంటి? గతంలో పలుమార్లు ఈ శిఖరాన్ని అధిరోహించినవారు ఏం చెబుతున్నారు? ఓసారి చూద్దామా.. 

26 వేల అడుగులు దాటితే.. 
ఈసారి ఎవరెస్టుపై ఎన్నడూ లేనంత రద్దీ కనిపించిందని చెబుతున్నారు. దీనికితోడు పర్వతారోహణ విషయంలో సరైన అనుభవం లేని వారు ఎక్కువగా ఉండటం కూడా మరణాలకు ప్రధాన కారణమని అనుభవజ్ఞులైన పర్వతారోహకులు చెబుతున్నారు. ‘ఈ మధ్య థ్రిల్‌ కోరుకునేవారు ఎక్కువైపోయారు. దీన్ని క్యాష్‌ చేసుకునే కంపెనీలు కూడా ఎక్కువయ్యాయి. ఈ అడ్వెంచర్‌ కంపెనీలకు డబ్బే ప్రధానమైపోయింది. అర్హత లేని గైడ్లు, షెర్పాలను పనిలో పెట్టుకున్నారు. అటు పర్వతారోహణ చేయాలనుకుంటున్నవాళ్లకు సరైన అనుభవం ఉందా వారు ఎవరెస్టు వంటి శిఖరాన్ని అధిరోహించగలరా వంటివేమీ చూసుకోవడం లేదు’ అని ఎవరెస్టును పలుమార్లు అధిరోహించిన అలెన్‌ చెప్పారు. నువ్వు పోలీసు అవ్వాలంటేనే పలు టెస్టులు పాసవ్వాలి.. అలాంటిది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అధిరోహించడానికి నీకు తగిన అర్హత ఉండాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. నిజానికి 25–26 వేల అడుగులు దాటామంటే.. పర్వతారోహకులకు అది డెత్‌ జోన్‌ కిందే లెక్క. మైండ్, బాడీ సరిగా పనిచేయవు. ప్రతి నిమిషం విలువైనదే.

ఎవరెస్టు ఎత్తు 29,029 అడుగులు.. అంత పైకి వెళ్తున్నప్పుడు చివరి దశలో వారు తమ వద్ద ఉన్న బ్యాగేజీనంతటినీ వదిలేస్తారు.. వెళ్లి, తిరిగిరావడానికి వీలుగా కంప్రెస్డ్‌ ఆక్సిజన్‌ క్యాన్‌లను మాత్రమే తీసుకెళ్తారు. వారు నిర్ణీత సమయంలో శిఖరాగ్రానికి వెళ్లి తిరిగి వచ్చేయాలి. లేదంటే.. ఆక్సిజన్‌ అయిపోయి చనిపోతారు. అనుభవం లేని పర్వతారోహకులు వేగంగా తిరిగి రాలేకపోవడం వంటివి జరిగాయని షెర్పాలు చెబుతున్నారు. అదే సమయంలో అనుభవజ్ఞులైన వారు కూడా చనిపోయారు. దీనికి కారణం.. ఎప్పుడూ లేనంత ట్రాఫిక్‌ జామే.. లైనులో గంటల తరబడి వేచి ఉండటం వల్ల ఆక్సిజన్‌ అయిపోయి ఉంటుంది.. లేదా శరీరంలో విపరీతమైన మార్పులు ఏర్పడటం వంటివి జరిగి ఉంటాయని పేర్కొంటున్నారు. ట్రాఫిక్‌ జామ్‌ వల్ల  ఇబ్బంది ఉంటుందని తెలిసినా.. చివరి దశకు వచ్చేసరికి కొందరు మొండిగా ముందుకు పోతారని.. దాని వల్ల కూడా మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. ‘మే నెల ఎవరెస్టు అధిరోహణకు సరైన సమయం.. ఆ నెలలోనూ కొన్ని రోజుల్లోనే అక్కడంతా క్లియర్‌గా.. గాలులు తక్కువగా ఉంటాయి.. ఆ సమయంలో శిఖరాగ్రం చేరుకోవడం సులభం.. దాంతో.. ఒకే సమయంలో ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించారు. దీంతో చాలామంది చనిపోయారు’ అని అలెన్‌ చెప్పారు.   

నేపాల్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం.. 
‘ఎవరెస్టును రెండువైపుల నుంచి ఎక్కవచ్చు.  ఒకటి నేపాల్‌.. మరొకటి చైనా వైపు నుంచి.. నేపాల్‌ ఓ పేద దేశం.. దీనిపై వచ్చే డాలర్ల కొద్దీ ఆదాయాన్ని మాత్రమే చూస్తోంది తప్ప.. నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 400 మందికి పర్మిట్లు జారీ చేసింది. అదే చైనా చూస్తే 150 మందికే అనుమతి ఇచ్చింది. జామ్‌కు ఇదీ ఒక కారణం. ఇలా నిబంధనలను ఉల్లంఘిస్తూ పోతే.. మరణాలు పెరుగుతూనే ఉంటాయి’ అని మరో పర్వతారోహకుడు ఆడ్రియన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య అర్హత లేని కొన్ని కంపెనీలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.. అందులో నేపాల్‌కు చెందినవి అత్యధికంగా ఉన్నాయి. మరణాలు కూడా ఇటు వైపు నుంచి అధిరోహించినవారివే ఉండటం ఇక్కడ గమనార్హం. అయితే.. నేపాల్‌ ఉన్నతాధికారులు దీన్ని కొట్టిపడేస్తున్నారు. మరణాలకు కారణం.. ఓవర్‌క్రౌడింగ్‌ కాదని.. శిఖరాగ్రాన్ని అధిరోహించేందుకు వాతావరణపరంగా అనుకూలించే రోజులు పరిమితంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. పర్వతారోహకుల సంఖ్యను నియంత్రించడం ఎందుకు.. పూర్తిగా ఆపేస్తే పోలా అంటూ తేలికగా తీసిపారేస్తున్నారు.  

కళ్లముందే కూలిపోయినా సాయం చేయలేని పరిస్థితి..నీ దగ్గర ఉన్న ఆక్సిజన్‌ ఇస్తే..తర్వాత ఆక్సిజన్‌ అయిపోయి..చనిపోయేది నువ్వే.. ఏది ముఖ్యం.. మానవత్వమా? లేక మనం బతికుండటమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. మానవత్వాన్ని మంచులో సమాధి చేసి ముందుకు సాగాల్సిందే. 
ఫాతిమా, పర్వతారోహకురాలు, లెబనాన్‌   
- సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు