11న గుర్‌గావ్‌లో ఏమవుతుంది?

7 May, 2018 16:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హర్యానాలోని గుర్గావ్‌లోని సహారా మాల్‌ వద్ద గత శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు దాదాపు మూడు వందల మంది ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ఉద్యుక్తులవుతుండగా, నాలుగు కార్లలో దాదాపు 20 మంది యువకులు కర్రలు ధరించి రయ్‌మంటూ దూసుకువచ్చారు. అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేయవద్దంటూ ఆ యువకులు కర్రలు ఝుళిపిస్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డగించి, ముస్లింలను అక్కడి నుంచి తక్షణం వెళ్లిపోవాల్సిందిగా అదేశించారు. ముస్లింలు ఆరోజు అక్కడ ప్రార్థనలు చేయకుండానే ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయారు.

గత మూడేళ్లుగా సహారా మాల్‌ వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముస్లింలు నిరాటంకంగా ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈసారి వారికి అనుకోకుండా అవాంతరం ఏర్పడింది. గుర్గావ్‌లో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో దాదాపు  నగరంలోని దాదాపు 96 బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు జరుపుతారు. ఆ రోజు అంటే, శుక్రవారం నాలుగవ తేదీ నాడు దాదాపు పది బహిరంగ ప్రదేశాల్లో ముస్లింల ప్రార్థనలు జరుపుకోకుండా హిందూ యువకులు అడ్డుకున్నారు. వాటిలో సెక్టార్‌ 29, సెక్టార్‌ 53 ప్రాంతాలు కూడా ఉన్నాయి. సెక్టార్‌ 29లో గత 15 ఏళ్లుగా నిరాటంకంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటుండగా, సెక్టార్‌ 53లో గత 13 ఏళ్లుగా ముస్లిలు ప్రార్థనలు చేసుకుంటున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు జరపరాదని, ప్రార్థనలను మసీదులకే పరిమితం చేయాలని ‘సంయుక్త్‌ హిందూ సంఘర్ష్‌ సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు ఆరోజు ప్రార్థనలను హిందూ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సంఘర్ష్‌ సమితిలో ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్, భజరంగ్‌ దళ్, శివసేన, హిందూ జాగారణ్‌ మంచ్, అఖిల భారతీయ హిందూ క్రాంతి దళ్‌ సహా 12 హిందూ సంఘాలు ఉన్నాయి. ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు జరిపే బహిరంగ ప్రదేశాల్లో 500 నుంచి 1500 మంది ఒకేసారి ప్రార్థనలు జరపవచ్చు. గుర్గావ్‌లో మొత్తం 21 మసీదులు ఉన్నాయి. 300 మందికి మించి ఏ మసీదులో ఒకేసారి ప్రార్థనలు జరుపుకునే పరిస్థితి లేదు.

సంయుక్త్‌ హిందూ సంఘర్ష్‌ సమితి ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కూడా మాట్లాడారు.మసీదులు, ఈద్గాలు, ఇతర గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు ప్రార్థనలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి సూచనను కూడా ఎందుకు పాటించరని 29వ సెక్టార్‌లోని 42 ఏళ్ల యువకుడు నౌషాద్‌ అలీని మీడియా ప్రశ్నించగా, తాము పనిచేసిన చోటుకు సమీపంలో మసీదు లేదని, ఎక్కడో ఉన్న మసీదు వద్దకు వెళ్లి తిరిగి రావడానికి తనకు మూడు గంటల సమయం పడుతుందని చెప్పారు. తన యజమాని మధ్యాహ్నం భోజనం కోసం గంటకు మించి సమయాన్ని అనుమతించరని, ఏ యజమాని మాత్రం మూడు గంటలు అనుమతిస్తారని అలీ వ్యాఖ్యానించారు. ఓ హిందూ యజమాని వద్దనే అలీ వెల్డర్‌గా పనిచేస్తున్నారు.

ఆ ప్రాంతంలో చిన్నా, పెద్ద కంపెనీలన్నీ హిందువులవే. వారి వద్ద ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిం యువకులే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఫరీదాబాద్‌ చౌక్‌ వద్ద మొన్న ప్రార్థనలను పోలీసులు అనుమతించలేదని, అనుమతించకపోవే ఏం చేయాలో అర్థం కావడం లేదని మొహమ్మద్‌ గుల్షాద్‌ అనే యువకుడు ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలోని మీరట్‌ నుంచి వచ్చిన ఆయన కూడా వెల్డింగ్‌ షాపులో పనిచేస్తున్నారు. ఎప్పుడైనా తాము పోలీసుల అనుమతితోనే బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు జరిపేవారమని, అయితే ఎప్పుడు లిఖితపూర్వకంగా అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు.

ఇదే విషయమై పోలీసు అధికారులను మీడియా సంప్రతించగా, లిఖితపూర్వక అనుమతి అంటూ తాము ఎప్పుడూ ఇవ్వమని, అలాంటి అనుమతి కావాలంటే పౌర ఉన్నతాధికారుల నుంచి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే విషయమై ఉన్నత పౌర అధికారలను ప్రశ్నిస్తే బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు ప్రార్థనలు జరపడం ముఖ్యమంత్రికే ఇష్టం లేనప్పుడు తాము మాత్రం ఎలా అనుమతి ఇవ్వగలమని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే శుక్రవారం ఏమవుతుందోనని పలువురు ముస్లిం యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో హిందూ ఓటర్ల సమీకరణకు ఆరెస్సెస్‌ లాంటి సంస్థలు ఇలాంటి కుట్ర పన్ని ఉండవచ్చని కొందరు ముస్లిం యువకులు అనుమానం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు