భారతీయుల మూడు చింతలు! 

1 Jul, 2018 02:49 IST|Sakshi

నేతల, ఆర్థిక సంస్థల అవినీతి పెరిగిపోతోంది! 
చదువులెన్ని చదివినా ఉద్యోగాలు మాత్రం లేవు!! 
అన్ని చోట్లా.. నేరాలు, హింసాత్మక ఘటనలు!! 

ఈ మూడు అంశాల గురించి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఆలోచన చేశారా? చేసే ఉంటారు లెండి. ఎందుకంటే భారతీయులందరి మనసుల్ని పీడిస్తున్న మూడు ప్రధానమైన అంశాలివే. రాజకీయ, ఆర్థిక అవినీతి, నిరుద్యోగం, నేరాలు హింస అనే మూడు అంశాలు భారతీయులకు ఉన్న మూడు ముఖ్యమైన చింతలని ఇటీవల జరిగిన ఓ ఆన్‌లైన్‌ సర్వే కూడా నిర్ధారించింది. ‘‘వాట్‌ వర్రీస్‌ ద వరల్డ్‌’’ పేరుతో ఇప్సోస్‌ అనే సంస్థ దాదాపు 28 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. దేశంలో సర్వే చేసిన వారిలో 47 శాతం మంది రాజకీయ, ఆర్థిక అవినీతి తమను ఎక్కువగా చింతకు గురి చేస్తోందని చెబితే నిరుద్యోగం, నేరాల విషయంలో ఇబ్బంది పడుతున్న వారి శాతం 29, 42లుగా ఉంది. ప్రపంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అత్యధికులు ఈ మూడు అంశాలతోపాటు పేదరికం, సామాజిక అసమానతలు (33 శాతం),  ఆరోగ్య సేవలు (24 శాతం)లను ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు.

ఉగ్రవాదాన్ని ఓ సమస్యగా చెప్పిన వారి శాతం 26 వరకూ ఉంది. అవినీతి అనేది అన్నిదేశాల్లోనూ సామాన్యమైన సమస్యకాగా.. భారత దేశానికి వచ్చేసరికి దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది. దీంతోపాటు దాడులు, మానభంగాలు, హత్యల వంటి నేరాలు సర్వసాధారణమైపోయాయని సర్వేచేసిన పదిమందిలో నలుగురు అంగీకరించారు. అయితే మనిషి ఆశాజీవి అన్నట్టు.. సర్వే చేసిన వారిలో దాదాపు 60 శాతం మందికి పరిస్థితులన్నీ సర్దుకుంటాయన్న ఆశాభావం ఉంది. ప్రపంచస్థాయిలో తమ దేశం సరైన దిశలోనే వెళుతోందని 92 శాతం మంది చైనీయులు నమ్ముతూండగా, తరువాతి స్థానాల్లో సౌదీ అరేబియా (76), దక్షిణ కొరియా (74) ఉన్నాయి.

మరిన్ని వార్తలు