'మా అమ్మ కట్టెలపొయ్యిపై వండేది'

1 May, 2016 13:10 IST|Sakshi
'మా అమ్మ కట్టెలపొయ్యిపై వండేది'

బలియా: తాను ఓ చిన్న ఇంట్లో జన్మించానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆ ఇంటికి కిటికీలు ఉండేవి కావని చెప్పారు. తన తెల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేదని.. ఆ సమయంలో ఇంట్లో నిండుకున్న పొగలో అమ్మ సరిగా కనిపించకపోయేదని గత స్మృతులు నెమరువేసుకున్నారు. తన తల్లిలాగా ఏ స్త్రీమూర్తి శ్రమించకూడదనే తన ఉద్దేశం అని చెప్పారు. ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని బలియాలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు.

దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న పేద ప్రజలకు ఉచితంగా గ్యాస్ను అందించే ఉద్దేశంతో దాదాపు రూ.8000 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏం అన్నారంటే..

'బలియా పోరాటాల గడ్డ. ఈ నేల దేశ స్వాతంత్ర్యం కోసం ఒక మంగళ్ పాండేను ఇచ్చింది. ఇక్కడి ప్రజలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. మేడే సందర్భంగా మనమంతా ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సందర్భంగా దేశ పురోగతికి నిరంతరం శ్రమిస్తున్న కార్మికులందరికీ నా ధన్యవాదాలు, ప్రశంసలు. వారి సేవలు నిరుపమానం. మా ప్రభుత్వం పేదలకోసం, కార్మికుల కోసం పనిచేసే ప్రభుత్వం. మేం ఏచేసినా వారికోసమే. ప్రపంచం మొత్తాన్ని ఐక్యంగా ఉంచేది కార్మికులే. బలియాలో గ్యాస్ కనెక్షన్ లు చాలా తక్కువగా ఉన్నాయనే నేను ఇక్కడ ఈ పథకం ప్రారంభిస్తున్నాను. పేద కుటుంబాలకు, పే మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని నేను ఈ పనిచేయలేదు. గతంలో ఎన్నికలు లేని చోట్ల కూడా ఎన్నో పథకాలు ప్రారంభించాను' అని మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు