మమత హత్యకు సహకరిస్తే రూ. 65 లక్షలిస్తాం

18 Oct, 2017 12:43 IST|Sakshi

సాక్షి,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని హత్య చేస్తే రూ 65 లక్షలిస్తామని ముర్షిదాబాద్‌ జిల్లా బెహ్రంపోర్‌లో 19 ఏళ్ల విద్యార్థికి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న పాలిటెక్నిక్‌ విద్యార్థితో సంభాషించేందుకు ఉపయోగించే ఈ నెంబర్‌కు మెసేజ్‌ వచ్చింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి తనకు లాటిన్‌ అనే వ్యక్తి నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని ఈ మెసేజ్‌లతో షాక్‌కు గురైన విద్యార్థి చెప్పారు. మెసేజ్‌లు పంపిన వ్యక్తి తనకు తాను ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన వాడినని, భారత్‌లో భాగస్వామి కోసం చూస్తున్నామని చెప్పినట్టు విద్యార్థి తెలిపారు.

వాట్సాప్‌ మెసేజ్‌లిలా...

తాము చెప్పినట్టు చేస్తే లక్ష డాలర్లు ( రూ 65 లక్షలు) ఇస్తామని, మీకు ఎలాంటి ప్రమాదం ఉండదని గుర్తుతెలియని వ్యక్తి సదరు విద్యార్థికి పంపిన మెసేజ్‌ల్లో సంభాషించాడు.అయితే తనకు కొంత సమయం కావాలని విద్యార్థి కోరడంతో తొందరగా తమతో చేతులు కలపాలని, లేకుంటే వేరొకరిని ఎంపిక చేసుకుంటామని దుండగుడు తొందరపెట్టాడు. రూ 65 లక్షలను పోగొట్టుకోవద్దని ఒత్తిడి పెంచినట్టు సంభాషణల సారాంశంలో వెల్లడైంది. బాధిత విద్యార్థి నో థ్యాంక్స్‌ అని రిప్లై ఇవ్వగా మరికొద్ది సేపటికే మళ్లీ ఆన్‌లైన్‌లోకి వచ్చిన వ్యక్తి విద్యార్థిని లాసర్‌గా పేర్కొన్నాడు. రాత్రి 3.30 గంటలకు మళ్లీ లైన్‌లోకి వచ్చిన వ్యక్తి తాను త్వరలో భారత్‌ రానున్నట్టు చెప్పగా, తాను దేశాన్ని ప్రేమిస్తానని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడం తనకు ఇష్టం లేదని విద్యార్థి తేల్చిచెప్పారు. అయితే తాము భారత్‌ను నాశనం చేయబోమని, కేవలం ఒకరిని చంపాలని మాత్రమే అనుకుంటున్నామని ఆ వ్యక్తి సంభాషించాడు. ఈ ఉదంతంపై పశ్చిమ బెంగాల్‌ సీఐడీ దర్యాప్తు జరుపుతోంది.

మరిన్ని వార్తలు