ఎన్నికల క్షేత్రంలో 87 వేల వాట్సాప్‌ గ్రూపులు

26 Mar, 2019 09:44 IST|Sakshi

మరో పదిహేను రోజుల్లో మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు 87 వేలకు పైగా వాట్సాప్‌ గ్రూపులు పని చేస్తున్నాయట. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల నిపుణుడు అనూప్‌ మిశ్రా తెలిపారు. ప్రభుత్వ పథకాల నుంచి దేశభక్తి, హిందూత్వ వరకు ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను ఈ గ్రూపులు ప్రచారం చేస్తున్నాయని ఆయన అంటున్నారు. ఆయన లెక్కల ప్రకారం ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో గరిష్టంగా 256 మంది యూజర్లు ఉంటారు.

అంటే 87 వేల గ్రూపులు కలిసి దాదాపు 2 కోట్ల 20 లక్షల మందికి పైగా యూజర్లకు నేరుగా సమాచారాన్ని అందిస్తాయి. అంతేకాకుండా వాట్సాప్‌లోని ఒక యూజర్‌ ఒక మెసేజ్‌ను గరిష్టంగా ఐదుగురికి పంపవచ్చు. ఆ ప్రకారం 2.2 కోట్ల మంది ఒక్కొక్కరు ఐదుగురికి మెసేజ్‌లు పంపడం ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలరు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు అసలైన సమాచారం అందేందుకు వాట్సాప్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. తప్పుడు సమాచారాన్ని,కల్పిత వార్తలను అడ్డుకోవడానికి లక్ష మందికి శిక్షణ ఇచ్చి నియమించుకుంది.అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు నైతిక నియమావళిని పాటించేందుకు సమ్మతించింది.

మరిన్ని వార్తలు