‘కొండచిలువకు దారిచ్చిన పెద్దపులి’

21 Jul, 2020 18:42 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: పెద్దపులిని చూస్తే అడ‌విలోని ఏ జంతువైన ఉలిక్కిపాడాల్సిందే. ఎందుకంటే ఎంత‌టి ప్రాణినైనా అల‌వోక‌గా వేటాడి చంపే స్వ‌భావం దానిది. అలాంటి పులికి దారిలో ఓ కొండ‌చిలువ క‌నిపించింది. ఏ జంతువునైనా చూడగానే వేటాడి చంపే పులి కొండచిలువను చూడగానే తోకముడిచిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గతంలో ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్ క‌బినిలోని పర్యావరణ శాస్త్ర‌వేత్త అబ్ర‌హం రికార్డు చేసిన వీడియోను తాజాగా ఆటవీ అధికారి సుశాంత్‌ నందా మంగళవారం షేర్‌ చేశారు. ‘కొండచిలువకు దారిచ్చిన పెద్దపులి’ అనే క్యాప్షన్‌తో ట్వీట్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 12 వేలకు పైగా వ్యూస్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ‘పులి తెలివైనది.. ఆకలి తీర్చడానికి ఎన్నో హానీ చేయని జంతువుల ఉండగా ఈ పైథాన్‌పై దాడి చేసి అనవసర ప్రమాదం తెచ్చుకోవడం ఎందుకు అనుకుందేమో’, ‘పులికి కొండచిలువ ఎంతటి హానికరమైనదో తెలుసు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. (చదవండి: ఎక్క‌డా చూసి ఉండ‌రు.. ఇండియాలోనే సాధ్యం!)

గతంలో అబ్ర‌హం రికార్డు చేసిన ఈ వీడియోలో.. ‘‘నేను, నా డ్రైవ‌ర్ ఫిరోజ్‌తో క‌లిసి అక్క‌డ తిరుగుతుండ‌గా ఒక పెద్ద పులి క‌నిపించింది. మేము కాసేపు దానిని అనుస‌రిస్తూ వెన‌కే వెళ్ళాము. అయితే అది వెళుతున్న మార్గంలో ఒక కొండ‌చిలువ ఎదురైంది. రోడ్డుపై స్పీడ్ బ్రేక‌ర్‌లా తిష్ట వేసిన ఆ పైథాన్‌ను చూసి ఏం చేయాలో తెలియ‌క పులి అయోమ‌యంలో ప‌డింది. పెద్ద పులి జాగ్రత్తగా దాని చుట్టూ తిరుగుతూ ఆసక్తిగా చూస్తోంది. కాసేప‌టికి పులి రోడ్డు పక్కన పొదల్లోకి వెళ్లి దాక్కుంది. పులి పొద‌ల వెనుక దాక్కుని కొండ‌చిలువ క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించేందుకు ప్ర‌య‌త్నించింది. కాని పైథాన్ పులి మీద‌కు దూసుకు రావ‌డం ప్రారంభించింది" అని చెప్పారు. ఇక్కడ పులి మీద కొండ‌చిలువ పైచేయి సాధించిన‌ట్టు అయింది. అడ‌వినే భ‌య‌పెట్టే పులికి కొండ‌చిలువ కాసేపు చెమ‌ట‌లు ప‌ట్టించింది. (చదవండి: ఆయ‌న‌కు భూమి మీద ఇంకా నూకలున్నాయి)

మరిన్ని వార్తలు