అసోంలో 'ఆ...' అంటే పోలీసు కాల్పులు ఎందుకు?

17 Jan, 2018 18:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అసోంలోని డరంగ్‌ జిల్లా, ధూల పట్టణంలో జనవరి పదవ తేదీన పోలీసు కస్టడీలో హాసన్‌ అలీ అనే యువకుడు మరణించారు. ఆ వార్త దావానంలా వ్యాప్తించడంతో ఆ ప్రాంతమంతా ఉద్రేకాలతో అట్టుడికిపోయింది. వేలాది మంది ప్రజలు 15వ నెంబర్‌ జాతీయ రహదారిని ఆక్రమించి టైర్లు తగులబెట్టారు. రాళ్లు, రప్పలను రోడ్డుకు అడ్డంగా పడేశారు. వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. పోలీసుల చిత్ర హింసలను తట్టుకోలేకనే హాసన్‌ అలీ అకాల మరణం పొందారంటూ ప్రజలు అక్కడి స్థానిక పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. వారిని అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా, మొహిదుల్‌ హక్‌ అనే మరో యువకుడు మరణించడంతోపాటు ఓ మహిళ, మరో యువకుడు గాయపడ్డారు. 

గత మూడేళ్లలో అసోంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎంతో మంది ప్రజలు మరణించారు. ఒక్క 2016 సంవత్సరంలోనే అసోంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 16 మంది మరణించినట్లు జాతీయ క్రైమ్‌ రికార్డుల బ్యూరో వెల్లడిస్తోంది. 2015లో 12 మంది పౌరులు మరణించారు. దిగువ అసోంలోని గోల్పర వద్ద 2017, జూలై నెలలో జాతీయ రహదారిపై బెంగాలీ ముస్లింలను బెదరగొట్టి చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. యూకూబ్‌ అలీ అనే 22 ఏళ్ల యువకుడు ఆ కాల్పుల్లో మరణించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఈద్‌ జరుపుకునేందుకు వచ్చిన ఆ యువకుడు అన్యాయంగా చనిపోయాడు. జాతీయ రహదారిని అడ్డుకుంటే ఊరుకుంటామా ? అంటూ ఆ సంఘటనను గోల్పర పోలీసు సూపరింటెండెంట్‌ సమర్థించుకున్నారు. తమను అక్రమ వలసదారులు అంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ముస్లింలు ఆ రోజున రోడ్డెక్కారు. కజిరంగా నేషన్‌ పార్క్‌ సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించడం కోసం అసోం పోలీసులు 2016, సెప్టెంబర్‌ నెలలో కాల్పులు జరపగా ఇద్దరు మరణించారు. పది మంది గాయపడ్డారు.
 
దేశంలో ఎక్కడైన అల్లర్లు చెలరేగినా, నిరసనకారులు విధ్వంసానికి దిగినా వారిని అదుపు చేసేందుకు ప్రాణాంతంకాని ఆయుధాలనే పోలీసులు ఉపయోగించాలి. అంటే, ముందుగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడం, సాధ్యం కాకపోతే లాఠీ చార్జి ద్వారా చెదరగొట్టడం, వాటర్‌ గన్స్‌ను ప్రయోగించడం చేయాలి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే భాష్పవాయువు గోళాలను ప్రయోగించడం, అయినప్పటికీ ప్రయోజనం లేకపోయినట్లయితేనే కాల్పులు జరపాలి. అదీ ముందుగా గాలిలోకి, ఆ తర్వాత విధ్వంసకారుల కాళ్లపైకి. అసోంలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. పోలీసులు ప్రజల ఆందోళనలను అదుపు చేసేందుకు ప్రాణాంతకం కాని పద్ధతులను పాటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 'ఎక్కడ ఆందోళన జరిగితే అక్కడ పోలీసుల కాల్పులు జరుగుతాయి' అని 'కషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి' నాయకుడు అఖిల్‌ గొగోయ్‌ చెప్పారు. తాను దేశవ్యాప్తంగా చాలా రైతుల ఆందోళనలో పాల్గొన్నానని, ఇతర రాష్ట్రాల్లో లాఠీ చార్జి, ఆ తర్వాత వాటర్‌ గన్స్‌ ఉపయోగిస్తారని, ఆ తర్వాతనే గాలిలోకి కాల్పులు జరుపుతారని చెప్పారు. పోలీసులు వస్తూ వస్తూనే కాల్పులు జరపడం ఒక్క అసోంలోనే చూస్తున్నానని ఆయన చెప్పారు. 

అసోం పోలీసులు ఎందుకు కాలుస్తారు?
1979లో బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన విదేశీయలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయని, ఈ ఆందోళనలు ఆరేళ్లు సాగడం, అవి హింసాత్మకంగా మారడం వల్ల వాటిని అదుపుచేయడానికి పోలీసులు అడపా, దడపా కాల్పులకు దిగేవారని, ఆ తర్వాత అది వారికి అలవాటయిందని 'అసోమియా ప్రతిదిన్' పత్రిక మాజీ సంపాదకుడు హైదర్‌ హుస్సేన్‌ చెప్పారు. ఆయనతో సామాజిక కార్యకర్త, విద్యావేత్త అంకూర్‌ తమూలి ఫుకాన్‌ ఏకీభవిస్తూ 1990 దశకంలో పోలీసుల క్యారెక్టర్‌ పూర్తిగా మారిపోయిందని అన్నారు. 'అల్ఫా' ఆందోళనకు వ్యతిరేకంగా భారత సైన్యంతో కలిసి పనిచేయడం వల్ల అసోం పోలీసులకు తుపాకీ సంస్కతి అలవాటైందని చెప్పారు. ఆందోళనలకు, మతానికి ప్రత్యక్ష సంబంధం ఏమీ లేకపోయినప్పటికీ పోలీసు కాల్పుల్లో ఎక్కువ మంది ముస్లింలు చనిపోయడానికి కారణం వారిని చంపితే పెద్దగా జవాబుదారితనం ఉండదన్న విశ్వాసం పోలీసుల్లో బలంగా ఉండడమని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారికి స్థానిక ముస్లింలు అండగా నిలబడడమే అందుకు కారణమని చెప్పారు. 

ఈ వాదనలను స్థానిక పోలీసు అధికారులు ఖండించారు. తక్కువ సిబ్బందితో అల్లర్లను అదుపుచేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కాల్పులు జరపక తప్పడం లేదని అన్నారు.  సిబ్బంది కొరత కారణంగా సీఆర్‌పీఎఫ్‌ దళాల సహాయం కోరడం వల్ల వారు ఎక్కువగా కాల్పులు జరుపుతున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు