'నల్ల' తాచు ఎక్కడ?!

11 Dec, 2016 00:48 IST|Sakshi
'నల్ల' తాచు ఎక్కడ?!

రద్దయిన పెద్ద నోట్లు మొత్తం వెనక్కు వచ్చేస్తాయా?

నెల రోజుల్లోనే 90% నోట్లు బ్యాంకుల్లో జమ ∙రూ.14.18 లక్షల కోట్లకుగాను 13 లక్షల కోట్లు డిపాజిట్లు!
ఖాతాల్లో వేసుకోవడానికి ఇంకా 20 రోజుల గడువు ∙ఆపై 3 నెలల పాటు ఆర్‌బీఐలో మార్చుకునే వీలు
అదే జరిగితే నల్లధనం ఎక్కడుంది? ఏమైపోయింది? ∙అనుకున్న స్థాయిలో లేదా? ఉన్నా ‘రంగు’ మారిందా?


దేశంలో నల్లధనం అనే తాచుపామును అంతమొందించటం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేసింది. దేశమంతా హర్షించింది. ఇప్పుడు కరెన్సీ కోసం కష్టాలు పడుతోంది. బ్యాంకుల ముందు క్యూల్లో నిల్చుంది. మార్కెట్‌ మందగించింది. క్రయవిక్రయాలు పడిపోయాయి. వ్యవసాయం నుంచి విమానయానం వరకూ అన్ని రంగాలూ ప్రభావితమవుతున్నాయి. అంబానీ సంగతేమో గానీ.. ఆమ్‌ ఆద్మీ ఎంతో సతమతమవుతున్నాడు. అయినా అంతకంతకూ పెరిగిపో తున్న ‘నల్ల’తాచు అంతమవుతుందని.. ముందుముందు మంచి జరుగుతుందన్న ఆశాభావంతోనే ఉన్నాడు సామాన్యుడు. కానీ రద్దు చేసిన నెల రోజుల్లోనే దాదాపు 90 శాతం పెద్ద నోట్లు బ్యాంకులకు చేరినట్లు అనధికారిక వార్తలు చెప్తున్నాయి.

ఆర్‌బీఐ తాజాగా ప్రకటించిన అధికారిక లెక్క ప్రకారం చూసినా 80 శాతం నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి ఇంకా 20 రోజులకు పైగా గడువుంది. ఈ లో గా దాదాపు పెద్ద నోట్లు మొత్తం బ్యాంకుల్లోకి వచ్చేస్తా యన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి ఇంత భారీ కస రత్తుకు ఫలితమేమిటి? ఇన్ని కష్టాలకు ప్రతిఫలం ఏమిటి? బయటపడే నల్లధనం ఎంత? అసలు అంచనా స్థాయిలో నల్లధనం లేదా? ఉన్నా అది తెల్లగా మారిపోతోందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి!!

నల్లధనం అంచనా ఎంత?
రిజర్వ్‌ బ్యాంకు నివేదిక ప్రకారం 2016 మార్చి 31 నాటికి దేశంలో 16.42 లక్షల కోట్ల విలువైన నగదు చెలామణిలో ఉంది. అందులో రూ.1,000 నోట్లు 38.6% (రూ.6.33 లక్షల కోట్లు). రూ.500 నోట్లు 47.8% (రూ.7.85 లక్షల కోట్లు). మొత్తం కరెన్సీ నోట్ల విలువలో ఈ రెండు నోట్ల విలువ 86.4%. నవంబర్‌ 8వ తేదీ రాత్రికి రాత్రి.. రూ. 14.18 లక్షల కోట్ల విలువైన నోట్లు చెల్లకుండా పోయాయి. చెలామణిలో ఉన్న నోట్లలో 20 శాతం నల్లధనం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా. పెద్ద నోట్ల రద్దు ద్వారా కనీసం రూ.3 లక్షల కోట్ల వరకూ నల్లధనంగా తేలుతుందని పేర్కొంది. మన దేశ స్థూల జాతీయోత్పత్తి 2015–16లో రూ.136 లక్షల కోట్లు (ప్రస్తుత ధరల ప్రకారం) అనుకుంటే.. అందులో ప్రభుత్వం వెలికి తీయగలనని చెప్తున్న నల్లధనం భాగం 2% మాత్రమే ఉంటుంది. (మన జీడీపీలో కరెన్సీ నోట్ల సంఖ్య 12%) ప్రభుత్వం మాత్రం రూ.4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకూ నల్లధనం తేలుతుందని అంచనా వేసింది.

90% తిరిగొచ్చేసింది!
► ఈ ఏడాది నవంబర్‌ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్లు రద్దయ్యాయి. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి డిసెంబర్‌ 30 వరకూ గడువు ఉంది. అయితే.. డిసెంబర్‌ 7వ తేదీ నాటికే.. అంటే రద్దయిన నెల రోజులకే దాదాపు 13 లక్షల కోట్ల విలువైన నోట్లు డిపాజిట్‌ అయినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌ కథనం ప్రచురించింది. బ్యాంకుల్లో డిపాజిట్ల తాజా వివరాల కోసం ఆర్‌బీఐని సంప్రదించినా స్పందించలేదని పేర్కొంది.
► రద్దు చేసిన నోట్ల విలువ రూ.14.18 లక్షల కోట్లు అయితే.. నెల రోజుల్లోపలే బ్యాంకులకు రూ.13 లక్షల కో ట్లు జమ అయ్యాయంటే.. ఇంకా బయటే ఉన్న రద్దయిన నోట్ల విలువ సుమారు రూ.1.20 లక్షల కోట్లు ఉంటుంది.
► పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.11.85 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయని ఆర్‌బీఐ గవర్నర్‌ ఇటీవల వెల్లడించారు. ఇది మొత్తం రద్దయిన విలువలో 80 శాతం. కానీ.. అది ఏ తేదీ వరకూ అన్నది ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఈ లెక్కన చూస్తే ఇంకా రూ.2.33 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు బయట ఉన్నాయి.

మరి నల్లధనం ఎక్కడ?
► ఈ గడువు లోగా.. ఇంకా మిగిలివున్న నోట్లు పూర్తిగా కాకపోయినా అధిక భాగం బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకుల అంచనా. మొత్తం మీద బ్యాంకుల్లోకి రాకుండా నిలిచిపోయే మొత్తం.. రూ.50 వేల కోట్ల లోపే ఉంటుందనేది పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే.. నల్లధనం నిల్వలపై ప్రభుత్వ అధిక అంచనాలు తప్పి ఉండాలి లేదా నల్లధనం తెలుపుగా మారిపోయి ఉండాలి అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
► రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకారం 2016 మార్చి 31 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్ల విలువ రూ. 14.18 లక్షల కోట్లు. అయితే.. ఈ నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో పెరుగుతున్న డిపాజిట్లు.. నల్లధనం ఎక్కువగా తేలే అవకాశం లేదన్న విశ్లేషణలతో ప్రభుత్వం చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువను రూ. 15.5 లక్షల కోట్లుగా సవరించినట్లు వార్తలు వచ్చాయి. మార్చి 31 నుంచి నవంబర్‌ 8వ తేదీ వరకూ జారీ చేసిన పెద్ద నోట్ల విలువను అదనంగా చేర్చినట్లు ఆ వార్తల సారాంశం. కానీ ఈ ‘సవరణ’ను అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆర్‌బీఐ కానీ అధికారికంగా ప్రకటించలేదు.
► డిపాజిట్‌ అయిన పెద్ద నోట్ల విలువపై ఆర్‌బీఐ తాజా ప్రకటనను, మొత్తం రద్దయిన పెద్ద నోట్ల విలువపై అనధికారికంగా సవరించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంకా వెలుపలే ఉన్న పెద్ద నోట్ల విలువ రూ. 3.65 లక్షల కోట్లు. ఈ నోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి ఇంకా మూడు వారాల గడువు మిగిలే ఉంది. ఆ తర్వాత మరో మూడు నెలల పాటు (మార్చి వరకూ) రిజర్వు బ్యాంకు ద్వారా కూడా డిపాజిట్‌ చేసుకోవచ్చు. కాబట్టి.. ‘సవరించిన లెక్క’ ప్రకారం చూసినా.. ప్రభుత్వం ఆశించిన స్థాయికి దరిదాపుల్లో నల్లధనం తేలే అవకాశం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

‘నలుపు’ రంగు మార్చుకుందా?
► నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే దేశ వ్యాప్తంగా నల్లధనాన్ని తెలుపులోకి మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను పొందడానికి చాలా మంది నల్లకుబేరులు తమ తమ మార్గాల్లో ప్రయత్నించారు.
► పెద్ద నోట్లు రద్దయిన వెంటనే దేశంలో బంగారం కొనుగోళ్లు, డాలర్ల వంటి విదేశీ మారక ద్రవ్యం కొనుగోళ్లు పెద్ద ఎత్తున సాగినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం మార్కెట్‌ రేటు కన్నా అధిక మొత్తంలో డబ్బు చెల్లించి కొన్నట్లు తెలుస్తోంది.
► చాలా పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలు తమ తమ ఉద్యోగులకు పాత నోట్లతో మూడు నాలుగు నెలల జీతాలు ముందుగానే చెల్లించేసి, నల్లధనాన్ని ఖర్చుచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని పరిశ్రమలు అవసరమైన ముడిసరుకులను పెద్ద మొత్తంలో కొని నిల్వ చేసుకున్నాయి.
► ఆర్‌బీఐ కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేయగానే.. కొన్ని బ్యాంకుల శాఖలు, ఉద్యోగులతో కుమ్మక్కై.. రద్దయిన కరెన్సీ నోట్లను పెద్ద మొత్తంలో మార్చుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి పలువురిపై చర్యలు, విచారణలు చేపట్టారు కూడా.
► పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చే కొత్త హవా లా రాకెట్లు పుట్టుకొచ్చాయని.. 30% నుంచి 50% వరకూ కమీషన్‌తో నోట్ల మార్పిడి చేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.
సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు