లైవ్‌లో మాట్లాడుతుండగానే అరెస్ట్ చేసి..!

26 Jan, 2018 15:17 IST|Sakshi
కర్ణిసేన కీలకనేత సూరజ్‌పాల్ అము

సాక్షి, చంఢీగఢ్: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ మూవీ విడుదల కావడంతో కర్ణిసేన దేశంలో పలు చోట్ల విధ్వంసానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలంటూ పిలుపునిస్తున్న కర్ణిసేన కీలకనేత సూరజ్‌పాల్ అమును హర్యానా పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. జాతీయ మీడియాతో పద్మావత్ మూవీపై లైవ్‌లో వ్యతిరేకంగా మాట్లాడుతుండగా అప్రమత్తమైన పోలీసులు సూరజ్‌పాల్‌ను అదుపులోకి తీసుకుని భోండ్సి జైలుకు తరలించారు. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా కర్ణిసేన నేత బయట ఉండటం మంచిది కాదని భావించిన పోలీసులు ఈ నెల 29 వరకూ సూరజ్‌పాల్‌ను జ్యూడిషియల్ కస్టడీలో ఉంచనున్నట్లు సమాచారం.

గుర్‌గావ్ లోని డీసీపీ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించిన అనంతరం ఈస్ట్ జోన్ డీసీసీ కుల్దీప్ సింగ్ మేజిస్ట్రేట్ అధికారాలను వినియోగించి కర్ణిసేన వివాదాస్పదనేత సూరజ్‌పాల్‌ను తమ కస్టడీలో ఉంచడమే ఉత్తమమని నిర్ణయించారు. గురుగ్రామ్‌లో, హర్యానాలో గానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడటంలో భాగంగా వివాదాస్పదనేత కస్టడీకి తీసుకున్నామని, బెయిల్ కూడా నిరాకరించినట్లు వివరించారు. అసాంఘిక శక్తులను రెచ్చగొట్టి, విధ్వంసానికి పాల్పడితే చూస్తు ఊరుకునేది లేదని కర్ణిసేన నేతలతో పాటు మరికొన్ని వర్గాలను డీసీపీ హెచ్చరించారు.

పద్మావత్ మూవీలో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్‌లు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పద్మావత్‌ చిత్రాన్ని ప్రదర్శించవద్దంటూ కర్ణిసేన ఆందోళనలు చేస్తోంది. 'దీపికా పదుకునే చెవులు, ముక్కు కోసిన వారికి క్షత్రియ కమ్యూనిటీ రూ.కోటి బహుమతిగా ఇస్తుంది' అని క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్‌ సోషల్ మీడియాలో ప్రకటించడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు