ముండే తరువాత ఎవరు?

4 Jun, 2014 13:34 IST|Sakshi
ముండే తరువాత ఎవరు?
'మేం గోపీనాథ్ ముండేని మూడంటే మూడు నెలలు మాత్రం ఢిల్లీకి అప్పుగా ఇస్తున్నాం. ఆయన మళ్లీ మహారాష్ట్రకు రావలసిందే. మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కావలసిందే' అన్నారు మహారాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షులు దేవేంద్ర ఫడ్నిస్. 
 
ఈ ఒక్క మాట చాలు ముండే బిజెపి మహారాష్ట్ర వ్యూహంలో ఎంత ముఖ్యమైన వ్యక్తో చెప్పడానికి. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి మటుమాయమైపోతే మహారాష్ట్ర బిజెపి పరిస్థితి ఏమిటి? ముండే తరువాత ఎవరు - ఇప్పుడు మహారాష్ట్రలో బిజెపి ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. కొద్ది నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముండే చేసి వెళ్లిన ఖాళీని పూరించడం బిజెపి ముందున్న అతిపెద్ద సవాలు.
 
ముండే చాలా విలక్షణమైన రాజకీయ నేత. ఆయనకు చాలా కోపం. రెండు సార్లు బిజెపి వదిలేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటారు. మోడీ, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ ల లాగా ఆయన బిజెపికి బిసి ఫేస్ ఇచ్చిన నేత. 
 
మామూలుగానైతే మహారాష్ట్ర రాజకీయాలను చెరుకు తోటల్ని, చక్కెర ఫాక్టరీలను గుప్పెట్లో పెట్టుకున్న మరాఠాలే శాసిస్తారు. శరద్ పవార్, వసంత్ దాదా పాటిల్, యశ్వతరావ్ చవాన్, శంకర్ రావ్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, నారాయణ్ రాణే, విలాస్ రావ్ దేశ్ ముఖ్ ల వంటి వారందరూ మరాఠాలే. అలాంటిది బిజెపిలోకి బిసిలను తెచ్చి, లెక్కలన్నీ మార్చింది గోపీనాథ్ ముండే. ఆయన వంజారా తెగకు చెందిన వారు. ఆయన వెంట వంజారాలతో పాటు ఇతర బిసిలు నిలిచారు. రాష్టంలోని ప్రతి జిల్లాలో ఆయనకు బలం ఉంది. ఆయన ప్రభావం ఎంత ఉందంటే మామూలుగా ఎవరి మాటా వినని మోడీలాంటి సీతయ్యే ముండే చెప్పినందుకు రావూ సాహెబ్ దన్వే అనే బీసీ నేతకు కేంద్ర మంతి పదవి ఇచ్చేశారు.
 
అసలు ఆయన బిసి, ఆయన బావ ప్రమోద్ మహాజన్ బ్రాహ్మణుడు. ఈ కృష్ణార్జునుల కాంబినేషన్ మహారాష్ట్ర బిజెపిని ఒక దశలో ఏలింది. మహాజన్ మరణం తరువాత ముండేకి కష్టాలు వచ్చాయి. ఆయన రెండు సార్లు బిజెపిని వదిలేస్తానని బెదిరించారు. ఉమాభారతి, కళ్యాణసింగ్ లు కూడా ఒకానొక దశలో పార్టీని వదిలి బయటకు వచ్చారు. 
 
అయితే ఇప్పుడు బిజెపి ముందున్న ప్రశ్న ముండే తరువాత ఎవరు? అంత ప్రజాదరణ ఉన్న నాయకులెవరు? బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ప్రస్తుతం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నిస్ లు ఇద్దరూ బ్రాహ్మణులు, పైగా చిన్న ప్రాంతమైన విదర్భకు చెందిన వారు. మహారాష్ట్ర రాజకీయాలు మరాఠ్వాడా చుట్టూ తిరుగుతాయి.
 
ఈ నేపథ్యంలో ముండే తరువాత ఆయన కుమార్తె పంకజ మరాఠ్వాడా నేతగా, మహారాష్ట్ర విధాతగా ఎదుగుతుందా? ఆమె ఇప్పటికే ఎమ్మెల్యే. ఈ సారి బీడ్ నియోజకవర్గంలో తండ్రి ఎన్నికల ప్రచారాన్ని ఆమే నడిపించింది. ముండే అంతిమయాత్రలో దర్శనం దక్కక చెలరేగిన అభిమానులు పంకజ చేతులు జోడించగానే చల్లబడిపోయారు. వంజారా, బీసీలతో సహా బిజెపి కింది స్థాయి కార్యకర్తలపై ఆమె పట్టు ఎంతుందో ఈ సంఘటన తెలియచేస్తుంది. అయితే కుటుంబవాదాన్ని ప్రోత్సహించని మోడీ పంకజకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? పంకజ నాయకత్వాన్ని గడ్కరీ, ఫడ్నిస్ లు ఒప్పుకుంటారా?
 
ఎన్నికల వేళ ఒక వైపు బాల్ ఠాక్రే కుటుంబానికి చెందిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. బాల్ ఠాక్రే ఏ నాడూ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఆయన చంద్రసేనీయ కాయస్థ ప్రభు సామాజిక వర్గానికి చెందిన వారు. అది మహారాష్ట్రలో చాలా తక్కువ సంఖ్యాబలం ఉన్న కులం. అందుకే ఆయన కింగ్ మేకర్ గా ఉన్నారే తప్ప కింగ్ కాలేదు. ఇప్పుడు ఉద్ధవ్, రాజ్ లు కింగ్ లు కావాలనుకుంటున్న సమయంలో ముండే వంటి అనుభవజ్ఞుడైన ముండే ఉండి ఉంటే బిజెపి పని సానుకూలమయ్యేది. అందుకే 'ముండే తరువాత ఎవరు' అన్నదే బిజెపి ముందున్న ప్రశ్న! 
మరిన్ని వార్తలు