ఇంతటి దారుణంలో నిజమైన నేరస్థులెవరు?

21 Feb, 2018 20:12 IST|Sakshi

సాక్షి, జమ్మూ : ‘వెయ్యి మంది కూడా వస్తారనుకోలేదు. మూడు నుంచి నాలుగు వేల మంది వరకు వచ్చారు. ఆడవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో రావడం ఆశ్చర్యం’ అని కథువా జిల్లాలోని హీరానగర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వద్ద వారి రాకకోసం ఎదురు చూస్తున్న విజయ్‌ శర్మ అనే న్యాయవాది విజయ హాసంతో వ్యాఖ్యానించారు. జుడీషియల్‌ కస్టడీలో ఉన్న ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్‌ కజూరియా, సురీందర్‌ వర్మలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ హీరానగర్, దానికి అనుకుని ఉన్న రసనా గ్రామం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు నిరసన ప్రదర్శనగా మూడు రోజుల క్రితం అక్కడికి తరలి వచ్చారు.

న్యాయవాదే కాకుండా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న విజయ్‌ శర్మ ఇటీవలే మరో కొత్త బాధ్యతలను కూడా స్వీకరించారు. జనవరి 23న ఏర్పాటు చేసిన ‘హిందూ ఏక్తా మంచ్‌’కు ఆయన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన హిందూ ఏక్తా మంచ్‌ పేరిట ఇచ్చిన పిలుపు మేరకు ఆ మూడు, నాలుగువేల మంది ప్రజలు తరలి వచ్చారు. వారు విడిచిపెట్టాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్న నిందితులు సాధారణ పౌరులు కాదు, మిలిటెన్సీని అణచివేసేందుకు కశ్మీర్‌ వచ్చిన ప్రత్యేక పోలీసు దళానికి చెందిన ఇద్దరు అధికారులు. వారిని అరెస్ట్‌ చేసింది కూడా సాధారణ నేరారోపణలపై కాదు. రసనా గ్రామానికి చెందిన ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికను దారుణంగా రేప్‌ చేసి, హత్య చేసిన నేరంపై. ఆ పాపకు డ్రగ్స్‌ కూడా ఇచ్చి రేప్‌ చేశారన్నది రాష్ట్ర క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు. రసనా గ్రామంలో బాకర్‌వాలాగా పిలిచే ఓ ముస్లిం తెగకు చెందిన బాలిక అవడం వల్లనే హిందూ మంచ్‌ ఆధ్వర్యంలో నిందితులను విడుదల చేయాల్సిందిగా నేటికి ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపు (ఫిబ్రవరి 22న) కథువా జాతీయ రహదారి దిగ్బంధనానికి హిందూ మంచ్‌ పిలుపునిచ్చింది.

రసనా సమీపంలోని అటవి ప్రాంతంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలిక శవం జనవరి 17వ తేదీన పోలీసులకు దొరికింది. ఆ పాపకు డ్రగ్స్‌ ఎక్కించినట్లు, పలుసార్లు రేప్‌ చేసినట్లు ఫోరెన్సిక్‌ రిపోర్టులో తేలింది. అంతకు వారం రోజుల ముందే ఆ పాప అదృశ్యం అయింది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప ఆచూకీ కోసం పోలీసులు కూడా పెద్దగా ప్రయత్నాలేమీ చేయలేదని తెల్సింది. ఆ తర్వాత జనవరి 21వ తేదీన దీపు భయ్యాగా  పిలిచే 15 ఏళ్ల బాలుడిని పోలీసులు పట్టుకొచ్చి నిందితుడిగా చూపారు. హీరానగర్‌ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు అలాంటి వాడు కాదని స్థానికులు చెప్పడం, పోలీసుల చిత్ర హింసలకు ముందుగా నేరాన్ని అంగీకరించినా ఆ తర్వాత ప్రజల సమక్షంలో తానేపాపం చేయలేదని మొరపెట్టుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీనిపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం కేసును స్థానిక పోలీసుల నుంచి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు జనవరి 23వ తేదీన అప్పగించింది. వారు ప్రత్యేక పోలీసు బలగానికి చెందిన దీపక్‌ కజూరియా, సురీందర్‌ వర్మలను అరెస్ట్‌ చేసింది. వారు ఏ ప్రత్యేక పోలీసు బటాలియన్‌కు చెందిన వారో, అందులో వారి హోదా ఏమిటో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు బహిర్గతం చేయలేదు. వారు హిందులు కావడం, రాష్ట్రస్థాయిలో కేసు దర్యాప్తు పర్యవేక్షిస్తున్న అధికారి ముస్లిం కావడంతో కేసు హిందువులు–ముస్లింల గొడవగా మారింది. బీజేపీ, ఆరెస్సెస్‌ల పిలుపుతో ఫిబ్రవరి 14వ తేదీన, 17వ తేదీన నిరసనగా ప్రదర్శనలు జరిగాయి.

ఇదో రకమైన జిహాద్‌ అని, అందులో భాగంగా హిందూ అధికారులను అరెస్ట్‌ చేశారని లాయర్‌ విజయ్‌ శర్మతోపాటు కథువా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌నాథ్‌ డోగ్రా ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మొదట అరెస్టై, విడుదలైన నిందితుడు హిందువే. తర్వాత అరెస్టయిన అధికారులు హిందువులే. దారుణమైన రేప్‌కు, హత్యకు గురైన బాలిక మాత్రం ముస్లింకదా! ఆ పాపకు న్యాయం జరగాలి కదా! అంటూ మీడియా ప్రశ్నిస్తే కేసును సీబీఐకి అప్పగించి దోషులెవరో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 17న భారీ ఎత్తున జరిగిన నిరసన ప్రదర్శనలో భారత్‌ మాతా జిందాబాద్‌!, పాకిస్థాన్‌ ముర్దాబాద్‌! నినాదాలతోపాటు జాతీయ జెండాలు కనిపించాయి. రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసుకు జాతీయవాదానికి సంబంధం ఏమిటని మీడియా ప్రశ్నించగా, ముస్లింలు మన జాతి వ్యతిరేకులని, రసనా గ్రామంలోని బాకర్‌వాలా ముస్లింలు కూడా పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు ఇస్తారని వారన్నారు.

రసన గ్రామంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మీడియా ప్రశ్నలకు పెంపుడు తండ్రి మొహమ్మద్‌ యూసుఫ్‌ సమాధానం ఇచ్చారు. తాము ఫలానా వారు నిందితుడు కావచ్చనిగానీ, ఫలానా వ్యక్తిపై అనుమానాలు ఉన్నాయనిగానీ పోలీసులకు చెప్పలేదన్నారు. తమ పాపకు న్యాయం చేయమని మాత్రమే కోరామని అన్నారు. తమ గ్రామంలో మూడొంతుల మంది హిందువులేనని, వారి పొలాల్లోనే కాయం కష్టం చేసి బతుకుతూ వస్తున్నామని తెలిపారు. తమ బిడ్డకు అన్యాయం జరిగితే శవాన్ని పాతిపెట్టడానికి కూడా ఎవరూ అనుమతించలేదని, దానితో సమీపంలోని కూఠ గ్రామానికి వెళ్లి అక్కడ పజ్వాలా కమ్యూనిటీ స్థలంలో బిడ్డను పాతిపెట్టామని, అందుకు కూడా హిందువులు అడ్డుపడ్డారని మొహమ్మద్‌ వాపోయారు. తన బిడ్డకు అన్యాయం జరిగిందన్న బాధ కంటే తన బిడ్డ కారణంగా ఇప్పుడు గ్రామంలో హిందువులు, ముస్లింలు విడిపోవడం ఎక్కువ బాధ కలిగిస్తోందంటూ ఆ వృద్ధుడు కన్నీళ్ల పర్యంతం అయ్యారు.


ఫిబ్రవరి 17వ తేదీన హిరానగర్‌లో హిందూ నాయకులు సమావేశమై ముస్లిలను వెలివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నెరపరాదని, పొలం పనులు, ఎలాంటి పనులకు పిలవరాదని నిర్ణయించారు. ఈ సమావేశానికి సహాయ మంత్రి హోదా అనుభవిస్తున్న రాష్ట్ర ఇతర వెనకబడిన వర్గాల సంక్షేమ బోర్డు వైస్‌ చైర్మన్‌ రష్పాల్‌ వర్మ, హీరానగర్‌ బీజేపీ శాసన సభ్యుడు కుల్దీప్‌ వర్మ, కాంగ్రెస్‌ పార్టీ కథువా జిల్లా అధ్యక్షుడు సుభాష్‌ గుప్తా హాజరయ్యారు. మొన్నటి వరకు కలసి ఉన్న ఓ మతస్థులను ఇలా వెలివేయడం ఎంతవరకు సమంజసమని ఓ దుకాణదారు ఓం ప్రకాష్‌ని ప్రశ్నిస్తే ‘మనగడ్డపై ఉంటూ పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటారు, వారికి అలాంటి శాస్తి జరగాల్సిందే’ అన్నారు. వారు పాకిస్థాన్‌ జిందాబాద్‌ అని నినాదం ఇవ్వడం ఎప్పుడైనా విన్నారా? అన్న ప్రశ్నకు తాను ఎన్నడూ వినలేదని, విన్నవాళ్లు చెప్పారని చెప్పారు. రేపటి జాతీయ రహదారి దిగ్బంధం ఎటుదారి తీస్తుందో చూడాలి!

>
మరిన్ని వార్తలు