'దమ్ముంటే సీబీఐ కేసు పెట్టుకోండి'

26 Nov, 2015 15:55 IST|Sakshi
'దమ్ముంటే సీబీఐ కేసు పెట్టుకోండి'

కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి పరోక్షంగా బీజేపీపై, దాని విధానాలపై విరుచుకుపడ్డారు. గురువారం ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు అంశాలపట్ల ఒంటికాలితో లేచారు. భారత్లో అసహన పరిస్థితులున్నాయంటూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. ఒక భారతీయుడిగా ఆయన ఎలా ఫీలయ్యారో అదే విషయాన్ని ఆమిర్ చెప్పారని అన్నారు. అసలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపొమ్మని చెప్పడానికి మీరెవరు అంటూ ఆయనను నిందించిన వారిని ప్రశ్నించారు. ఈ దేశం మనందరిదని, ఈ జన్మభూమి, ఈ కర్మభూమి అందరి సొత్తని గుర్తు చేశారు.

ఈ దేశం విడిచి పాకిస్థాన్ వెళ్లిపొమ్మని చెప్పడానికి మీరెవరు? మేం ఏం తినాలో చెప్పడానికి మీరెవరు అంటూ ఆమె ఒంటికాలిపై లేచారు. రాజకీయాల్లో భయపడుతూ మాట్లాడటం తనకు అలవాటు లేదని, తనకు చావంటే అస్సలు భయం లేదన అన్నారు. మరణం ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరోజు వస్తుందని అందుకే రాజకీయాల్లో అవినీతిని తానెప్పుడు తలెత్తి ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినప్పుడు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సీబీఐ కేసులు పెడతామని భయపెడుతుంటారని, ఒక వేళ కేసులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. తాను మాత్రం అస్సలు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. మరోపక్క, ఉగ్రవాదంపై కూడా ఆమె స్పందిస్తూ ఉగ్రవాదానికి కుల,మత, విశ్వాసాలు ఉండనే ఉండవని అన్నారు. నేరస్తులు నేరస్తులే, ఉగ్రవాదులు ఉగ్రవాదులేనని అన్నారు.

మరిన్ని వార్తలు