లాయర్లు, పోలీసుల్లో ఎవరు అధికులు!?

13 Nov, 2019 14:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్‌ హజారీ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణ జరిగి పది రోజులు గడుస్తున్నా న్యాయవాదులు ఇప్పటికీ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. నవంబర్‌ రెండవ తేదీ నాడు ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడడం, పలు వాహనాలు దగ్ధమవడం తెల్సిందే. ఆ రోజు తమపై దాడి జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈమధ్య వెలుగులోకి వచ్చిన ఆనాటి ఓ వీడియోను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అందులో డిప్యూటీ పోలీసు కమిషనర్‌ మోనికా భరద్వాజ్‌ సహా కొంత మంది పోలీసులను ఓ లాయర్ల బృందం తరమడం కనిపించింది. అలాగే పలు పోలీసు వాహనాలకు లాయర్లు నిప్పు పెట్టడం కనిపించింది.

మరో వీడియోలో నలుగురు పోలీసు అధికారుల వెంటపడగా రెండు చేతులు జోడించి ఆందోళన చేస్తున్న లాయర్లను మోనికా భరద్వాజ్‌ వేడుకోవడం, తన తుపాకీని ఎవరో కాజేశారంటూ తన సబార్డినేట్‌కు చెప్పుకోవడం కనిపించింది. ఆ తుపాకీ జాడ ఇప్పటికీ లేదు. నాటి ఘర్షణల్లో పది మంది పోలీసులు గాయపడినప్పటికీ, వీడియో సాక్ష్యాలు లభించినప్పటికీ ఇప్పటి వరకు సదరు న్యాయవాదులపై నమోదు చేయక పోవడం ఆశ్చర్యకరమైతే, న్యాయవాదులే ఇప్పటికీ ఆందోళన చేయడం మరింత ఆశ్చర్యకరం.

ఇదే మొదటి సారి కాదు
ఢిల్లీలో లాయర్లు, పోలీసులు ఘర్షణ పడడం ఇదే మొదటి సారి కాదు. 1988లో ప్రస్తుతం పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడీ నార్త్‌ ఢిల్లీకి డిప్యూటి పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు ఓ లాయర్‌ను ఓ పోలీసు అధికారి అరెస్ట్‌ చేసినప్పుడు లాయర్లు పెద్ద గొడవ చేశారు. కిరణ్‌ బేడీ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ఆమె ఆఫీసులోకి దూసుకుపోయి ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఢిల్లీలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగడం చాలా సాధారణమని ఢిల్లీలో 1985 నుంచి 2004 వరకు పలు సీనియర్‌ పదవుల్లో పనిచేసిన రిటైర్డ్‌ పోలీసు మాక్సివెల్‌ పెరీరా తెలిపారు. 1980వ దశకంలో హత్య కేసులో ఓ న్యాయవాదే ప్రధాన నిందితుడని తేలినప్పటికీ ఆయనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా ఓ జడ్జీపై న్యాయవాదులు ఒత్తిడి చేసి సంతకం చేయించుకున్నారని ఆయన చెప్పారు. చట్టానికి లాయర్లు అతీతులు కానప్పటికీ ఢిల్లీ న్యాయ వ్యవస్థలో మాత్రం పక్షపాతం కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

లాయర్లు, పోలీసుల మధ్య ఢిల్లీలో నవంబర్‌ రెండవ తేదీన ఘర్షణ జరగ్గా, మూడవ తేదేనీ ఆ సంఘటనపై ప్రత్యేక విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయవాదులపై లాఠీచార్జి జరిపి, కాల్పులకు పాల్పడిన వారిని సస్పెండ్‌ చేయాల్సిందిగా పోలీసు కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ను ఆదేశించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత నవంబర్‌ ఏడవ తేదీన ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు. ‘న్యాయవాదులకు వ్యతిరేకంగా వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి చర్య తీసుకోరు. ఏ అధికారం లేకుండా పోలీసు అధికారులను సస్పెండ్‌ చేస్తారు. ఇదేమీ న్యాయమో అర్థం కావడం లేదు’ అని పెరీరా వ్యాఖ్యానించారు. తమకు న్యాయం జరగాలంటే నవంబర్‌ ఐదవ తేదీన పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ ముందు వేల సంఖ్యలో పోలీసు నిరసన ప్రదర్శన జరిపినా లాభం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇదంతా అబద్ధమని, జడ్జీలేమీ తమ పట్ల పక్షపాతం చూపడం లేదని, చట్ట ప్రకారమే వారు ఉత్తర్వులు జారీ చేశారని పాటియాలా హౌజ్‌ కోర్టులో గత 11 ఏళ్లుగా ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాది అజయ్‌ కుమార్‌ ఖండించారు. సీనియర్‌ న్యాయవాది చిదంబరమే నేడు జైల్లో ఉన్నారని, నేరం చేసినప్పుడు మాత్రమే ఎవరైనా జైలుకు వెళతారని ఆయన వ్యాఖ్యానించారు. లాయర్ల వద్ద ఎలాంటి అధికారం లేదని, పోలీసుల వద్ద అధికారం ఉంది కనుకనే వారి వద్ద ఆయుధాలు, కర్రలు ఉన్నాయని మరో సీనియర్‌ న్యాయవాది యోగేంద్ర సింగ్‌ తోమర్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. వీడియోల గురించి ప్రస్తావించగా, అవి ఏకపక్షంగా తీసిన వీడియోలని చాలా మంది న్యాయవాదులు ఖండించారు.

మరిన్ని వార్తలు