ఇంతకీ పుల్ల పెట్టింది ఎవరు?

14 Sep, 2016 16:31 IST|Sakshi
ఇంతకీ పుల్ల పెట్టింది ఎవరు?

ఉత్తరప్రదేశ్‌లో వ్యవహారం నిన్న మొన్నటివరకు అంతా సమిష్టి కుటుంబంలా ఉండేది. ప్రభుత్వంలో కూడా అందరూ బంధువులే కనిపించేవాళ్లు. పార్టీ పెద్దాయన 'నేతాజీ' ములాయం సింగ్ యాదవ్.. ఆయన తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ ప్రభుత్వంలో ఒకానొక కీలక మంత్రి, నేతాజీ కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి. వీళ్లందరికీ సన్నిహితుడైన ఆజంఖాన్ కూడా మంత్రివర్గంలో కీలక సభ్యుడు. ఇలా అంతా 'మనవాళ్లే' అనుకునేవారు. కానీ ఉన్నట్టుండి.. ముసలం పుట్టింది. బాబాయ్ - అబ్బాయ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దాయన కలగజేసుకోవాల్సి వచ్చింది. బాబాయ్‌కి కావల్సిన వాళ్లను అబ్బాయ్ తప్పిస్తూ వెళ్లాడు. దాంతో అబ్బాయికి ఉన్న కీలక పదవుల్లో ఒకదానికి పెద్దాయన కత్తెర వేశారు. దాన్ని తమ్ముడికి గిఫ్టుగా ఇచ్చారు.

ఒక్కసారిగా సమాజ్‌వాదీ పార్టీ ములాయం-శివపాల్, అఖిలేష్ వర్గాలుగా విడిపోయింది. దీనంతటికీ వెనకాల ఎవరున్నారనే విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇది కుటుంబంలో గొడవ కాదని.. ఎవరో బయటి నుంచి గొడవ పెట్టారని అఖిలేష్ అంటున్నారు. అంటే.. ఈ మధ్య కాలంలో పార్టీకి వచ్చినవాళ్లని అంతా అనుకుంటున్నారు. అలా వచ్చిన పెద్దమనిషి అమర్ సింగ్ ఒక్కరే. బహుశా ఆయనే ఈ సమస్యలన్నింటికీ మూల కారణం అయి ఉంటారన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది. 'ఇందులో కుటుంబ గొడవలు మీకు ఎక్కడ కనిపించాయి, ఇది ప్రభుత్వంలో గొడవ మాత్రమే' అని అఖిలేష్ యాదవ్ మీడియాతో చెప్పారు. బయటినుంచి వచ్చేవాళ్లు పదే పదే వేలు పెడుతుంటే పనపులు ఎలా జరుగుతాయని కూడా వ్యాఖ్యానించారు. అమర్‌సింగ్‌తో పాటు మాజీ సీఎస్ దీపక్ సింఘాల్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారేమోనని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అఖిలేష్, శివపాల్ యాదవ్‌ల మధ్య గొడవ మొదలవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకమే అని తెలుస్తోంది. జూన్ 30వ తేదీన అప్పటివరకు సీఎస్‌గా ఉన్న అలోక్ రంజన్ పదవీ విరమణ చేశారు. అంతకుముందు శివపాల్ యాదవ్ దగ్గరున్న శాఖల్లో ఒకదానికి ముఖ్య కార్యదర్శిగా ఉండే దీపక్ సింఘాల్ పేరు ముందుకొచ్చింది. అదే ఖరారైంది. కానీ రెండు నెలల్లోనే సీఎం అఖిలేష్ యాదవ్ ఆయన్ను వెనక్కి పంపేశారు. కొన్ని నిర్ణయాలు ములాయంను సంప్రదించి తీసుకోగా.. మరికొన్నింటిని మాత్రం తాను సొంతంగానే తీసుకున్నానని అఖిలేష్ చెబుతున్నారు. శివపాల్ యాదవ్ శాఖలు పీకేయడమా.. సీఎస్‌ను తప్పించడమా.. ఇలా ఏ నిర్ణయం ఆయన సొంతంగా తీసుకున్నారో మాత్రం తెలియడంలేదు. ఇప్పుడు ఎటూ పంచాయతీ 'నేతాజీ' వద్దకు చేరింది కాబట్టి.. అక్కడ ఒక రాజీ ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నారు. లేనిపక్షంలో మాత్రం రాబోయే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి కష్టకాలం తప్పదు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలను బట్టి సమాజ్‌వాదీ, బీజేపీలకు దాదాపు సమానంగా సీట్లు వస్తాయంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుంటే మాత్రం పార్టీలో కొంతమేరకు చీలిక తప్పదు. అప్పుడు అది బీజేపీకి కలిసొచ్చే అంశం అవుతుంది. ఏం జరుగుతుందన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.

మరిన్ని వార్తలు