సంకీర్ణ కిరీటం ఎవరిది?

10 May, 2014 01:03 IST|Sakshi
సంకీర్ణ కిరీటం ఎవరిది?

ఎన్డీయే, థర్డ్‌ఫ్రంట్, యూపీఏల ఆశలు  చక్రం తిప్పనున్న ప్రాంతీయ పార్టీలు
 
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 12తో పూర్తవనుండటంతో ఇక అందరి చూపు 16న వెలువడే ఫలితాలపై పడనుంది. దేశంలో గత 20 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రంలో ఈసారి కూడా సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనేది అందిరికీ తెలిసిన విషయమే అయినా కూటమి సర్కారుకు సారథ్యం ఎవరిదన్న అంశంపైనే ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది.

ఎన్డీయే అవకాశాలు ఎంత?

 ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 190 నుంచి 290 వరకు సీట్లు దక్కుతాయని ఎన్నికలకు ముందు వివిధ సర్వేలు అంచనా వేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువని చెప్పొచ్చు. అయితే ఒకవేళ ఈ అంచనాలు తప్పి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల సంఖ్యాబలానికి ఎన్డేయే ఆమడ దూరంలో నిలిస్తే మాత్రం కొత్త పొత్తులు అవసరమవుతాయని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్‌కు 10 నుంచి 40 సీట్లు తక్కువ పడితే ఎన్డీయేకు చిన్న చిన్న పార్టీలను మచ్చిక చేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం 25 పార్టీలు ఉన్నాయి. వీటికి తోడుగా బీజేడీ, డీఎంకే వంటి పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. ఇక 40 నుంచి 80 సీట్లు తక్కువైన సందర్భంలో పెద్ద పార్టీల మద్దతు తప్పనిసరవుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ సీట్లు సాధిస్తాయన్న అంచనాలు ఉన్న పార్టీలను మద్దతు కోరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌తోపాటు అన్నాడీఎంకే, బీఎస్పీ వంటి కీలక ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేకు మద్దతిచ్చే అవకాశాలు కనిపించడంలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో 2016లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న అధికార అన్నాడీఎంకే 10 శాతం ఉన్న మైనారిటీల ఓట్లను పణంగాపెట్టి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఎన్డీయేకు మద్దతివ్వబోమని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పగా తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ సైతం ఎన్డీయేకు మద్దతిచ్చే ప్రసక్తేలేదని శుక్రవారం స్పష్టం చేశాయి. బీఎస్పీ తరఫున ఆ పార్టీ చీఫ్ మాయావతి, తృణమూల్ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి దీపక్ ఓబ్రీన్ ఈ మేరకు ప్రకటన చేశారు. కానీ పెద్ద పార్టీల మద్దతు తప్పనిసరైన పక్షంలో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసి ఎల్.కె.అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్ వంటి నేతలు ప్రధాని రేసులోకి వస్తే తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఎన్డీయేకు మద్దతివ్వొచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా. దేశాభివృద్ధి కోసం ఏ పార్టీ మద్దతునైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, రాజకీయ అస్పృశ్యతపై తమకు విశ్వాసం లేదని మోడీకి అత్యంత సన్నిహితుడు, బీజేపీ నేత అమిత్ షా శుక్రవారం ప్రకటించడం ఈ వాదనకు బలం చేకూర్చేలా కనిపిస్తోంది.

మూడో కూటమి ముచ్చట తీరేనా..

సార్వత్రిక ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు మూడో కూటమి సిద్ధమవుతూనే ఉంటుంది. కానీ అధికారం అందుకోలేకపోతోంది. అయితే ఈసారి ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంతాల ప్రజల ఆశలను గెలిపించేందుకు మూడో కూటమి వైపు మొగ్గుచూపుతుండటమే కాకుండా.. కాంగ్రెస్ సైతం తనకు అధికారం దక్కనప్పుడు మూడో కూటమికైనా మద్దతిచ్చేందుకు సిద్ధమవుతుండడం తాజా విశేషం. లెఫ్ట్ పార్టీలు, ఎస్పీ, అన్నాడీఎంకే, జేడీ(యూ), బీజేడీ, వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇవన్నీ కలిసి మూడో ఫ్రంట్‌గా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇందులో లెఫ్ట్ పార్టీలు రాకుంటే తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే రాకుంటే డీఎంకే ఈ కూటమిలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ మద్దతిస్తే మూడో కూటమికి అధికారం సులువవుతుంది. అలా మూడో కూటమికి అవకాశం దక్కే పక్షంలో ములాయంసింగ్ యాదవ్, జయలలిత, మమతా బెనర్జీ ప్రధాని రేసులో ముందుండే అవకాశం ఉంది.

యూపీఏ-3కు అవకాశం ఉందా?

కాంగ్రెస్ పార్టీకి 2004లో కేవలం 145 సీట్లు దక్కినా యూపీఏ కూటమికి నేతృత్వం వహించి ఐదేళ్లు పాలించింది. ఇప్పుడు కూడా 150 సీట్లు దక్కినా దేశాన్ని పాలిస్తామన్న ధీమాలో ఆ పార్టీ ఉంది. కానీ సర్వేలన్నీ యూపీఏకు 85 నుంచి 140 మధ్యే సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో యూపీఏ అధికారంలోకి రావడానికి అతితక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయేకు అధికారం దక్కడం సులువవని పక్షంలో యూపీఏ కూడా అధికారం దక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది. మూడో కూటమివైపు చూస్తున్న పార్టీలు... ఆ కూటమిలో అవకాశం దక్కని పక్షంలో చివరకు యూపీఏవైపే మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూటమిలో లుకలుకలు ఏర్పడి.. ఆ కూటమిలోని పార్టీలు యూపీఏకు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తే.. మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మూడోసారి పాలించే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు