ఎవరు తీసుకొచ్చారు? ఎలా వచ్చారు?

12 May, 2016 19:04 IST|Sakshi
ఎవరు తీసుకొచ్చారు? ఎలా వచ్చారు?

తిరువనంతపురం: కల్లోలిత లిబియాలో చిక్కుకొని కొన్ని రోజులపాటు నరకం అనుభవించిన ఆరు కుటుంబాలకు చెందిన 29 భారతీయులు ఎట్టకేలకు స్వదేశం చేరుకున్నారు. వీరు ఇలా కేరళ చేరుకొని తమ ఆప్తులతో సంతోషంలో మునిగిపోయారో లేదో.. వీరి తరలింపుపై అప్పుడే రాజకీయ వివాదం మొదలైంది.

మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లిబియా నుంచి కేరళకు చేరిన ఈ 29మందిని మేమంటే మేము భారత్‌ తీసుకొచ్చామంటూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయి. లిబియా నుంచి భారతీయుల తరలింపు తమ ప్రభుత్వం ఘనతేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ర్యాలీలో ఘనంగా ప్రకటించగా.. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాత్రం మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం ఖర్చులు భరిస్తే వారు కేరళకు తిరిగొచ్చారంటూ చాందీ చెప్తున్నారు. ఇక,  చాందీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. 'గతంలో ఇరాక్‌, లిబియా, యెమన్‌ నుంచి కేరళ వాసులను భారత్‌కు తరలించేందుకు ఖర్చులు ఎవరు భరించారో చెప్పండి చాందీగారు' అంటూ ఆమె ట్విట్టర్‌లో నిలదీశారు.

దీంతో ఇరకాటంలో పడిన చాందీ మరో వివరణ ఇచ్చారు. 'గతంలో కేరళ వాసుల తరలింపు కోసం సుష్మాస్వరాజే డబ్బులు చెల్లించారు. కానీ ఈసారి మాత్రం వారి తరలింపు కోసం మేం ఖర్చులు భరించాం' అని  ఆయన చెప్పారు. కావాలంటే తాజాగా లిబియా నుంచి వచ్చిన వారినే అడగండి.. నిజం తెలుస్తుందని చాందీ అన్నారు. అదే సమయంలో కేరళను సోమాలియాతో పోల్చడంపై ప్రధాని మోదీపై ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. మొత్తానికి లిబియా నుంచి భారతీయుల తరలింపు అంశం చుట్టే ఇప్పుడు కేరళలో రాజకీయాలు తిరుగుతున్నాయి.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా