ఆ మంటల్లో బూడిదైన ప్రాణాలకు ఎవరు బాధ్యులు?

13 Mar, 2018 18:20 IST|Sakshi
కార్చిర్చులో దగ్ధం అవుతున్న కురంగణి అడవులు, తమిళనాడు (పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు రాష్ట్రంలోని థేని జిల్లా అడవుల్లో ఆదివారం సంభవించిన కార్చిచ్చుకు పది మంది ట్రెక్కర్లు మరణించిన విషయం తెల్సిందే. అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోకుండానే ట్రెక్కర్లు అడవిలోకి వెళ్లారా? అనుమతి తీసుకొని వెళ్లి ఉంటే సకాలంలో మంటల బారి నుంచి వారిని ఎందుకు రక్షించలేకపోయారు? ఒకవేళ ట్రెక్కర్లు అధికారుల అనుమతి తీసుకోకుండా అడవుల్లోకి వెళ్లి ఉంటే ఆ విషయాన్ని అటవీ శాఖ అధికారులు సకాలంలో ఎందుకు తెలుసుకోలేపోయారు? ఎందుకు వారిని వారించలేక పోయారు? అసలు గ్రీష్మ బుతువు ప్రవేశించాక, అంటే అడువులు తగులబడే అవకాశం ఉన్నప్పుడు ట్రెక్కర్లకు ఎందుకు అనుమతినిచ్చారు? ఇత్యాది సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
 
భారత వైమానిక దళం సోమవారం నాడు తన సహాయక చర్యలను నిలిపేసిన తర్వాత ఈ ఆపరేషన్‌లో 27 మంది ట్రెక్కర్లను రక్షించినట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. మంటల్లో చిక్కుకుని పది మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. చెన్నై నుంచి 27 మంది ట్రెక్కర్ల బృందం, ఈరోడ్‌ నుంచి మరో 12 మంది ట్రెక్కర్ల బృందం అడవుల్లోకి ప్రవేశించినట్లు తెల్సింది. ఈ లెక్కన ఇంకా ఇద్దరి ఆచూకి తెలియాల్సి ఉంది. ట్రెక్కర్లు ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ సాహస యాత్రకు ఒడిగట్టారని మధురై సర్కిల్‌ ఫారెస్ట్‌ కన్సర్వేటర్‌ ఆర్కే జగానియా ఆరోపించారు.

ట్రెక్కర్లు ఫారెస్ట్‌ చెక్‌పోస్టుల గుండా వెళ్లలేదని థేని కలెక్టర్‌ కూడా తెలిపారు. కురంగణి అడవుల్లోకి వెళ్లిన ఈరోడ్‌ ట్రెక్కర్ల బృందం మాత్రం చెక్‌ పాయింట్ల గుండా వెళ్లిందని, అక్కడ అధికారులకు ట్రెక్కర్‌ ఒక్కరికి 200 రూపాయల చొప్పున చెల్లించామని ఈరోడ్‌ ట్రెక్కర్‌ బృందం సభ్యుడైన డీ ప్రభు విచారణ సందర్భంగా తెలిపారు. చెన్నై బృందం అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకోలేదని, ఈరోడ్‌ బృందం తీసుకుందని థేని జిల్లా స్పెషల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ తెలిపారు.

పది మంది మరణించడం వెనక ఇటు ట్రెక్కర్ల బృందం, అటు అటవీ శాఖ అధికారుల బృందం తప్పుందని శాస్త్ర నిపుణులు, అనుభవం కలిగిన సీనియర్‌ ట్రెక్కర్లు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ అధికారుల ముందస్తు అనుమతి, బృందం వెంట వారి సభ్యుడిని తీసుకెళ్లడం తప్పనిసరి చేయాలని వారు సూచిస్తున్నారు. అడవుల్లో ఎవరు ట్రెక్కింగ్‌ చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరని, ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఆ తక్కువ ఫీజును కూడా తప్పించుకునేందుకు తమ అనుమతి తీసుకోకుండా ట్రెక్కర్లు దొంగదారుల్లో అటవిలోకి జొరబడుతున్నారని వారు చెప్పారు.

మరిన్ని వార్తలు