చాంపియన్‌  ఎవరు?

2 Dec, 2018 12:58 IST|Sakshi

హోంమంత్రి కటారియా వర్సెస్‌ గిరిజా వ్యాస్‌ పోరుపై ఆసక్తి 

స్మార్ట్‌సిటీ ప్రకటించినా పెద్దగా కానరాని మార్పు

మహిళా ఓట్లపైనే కాంగ్రెస్, గిరిజా వ్యాస్‌ ఆశలు

సాక్షి : రాజస్తాన్‌ చరిత్రలో ఉదయ్‌పూర్‌ది ప్రత్యేక స్థానం. మొగలులకు ఎదురొడ్డి పోరాడిన మేవార్‌ వీరుడు మహారాణా ప్రతాప్‌.. తన తండ్రి రాణా ఉదయ్‌సింగ్‌ పేరుతో నిర్మించిన నగరమే ఇది. చుట్టూ సరస్సులతో అందంగా ఉంటుందీ నగరం. కానీ కాలక్రమంలో ఇదో బిజీ నగరంగా మారిపోయింది. నగరీకరణ కారణంగా.. ఆ సరస్సులన్నీ ఇప్పుడు మురికినీటితో నిండిపోయాయి. అద్భుతమైన కోటలు, రాజ మహల్‌ను చూసేందుకు వచ్చే వారికి ఇప్పుడు గుంతల రోడ్లు స్వాగతం పలుకుతాయి. చినుకుపడితే చిత్తడే. భారత చరిత్ర వారసత్వ సంపదను తనలో ఇమిడ్చుకున్న నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం.. స్మార్ట్‌ సిటీ జాబితాలో చేర్చింది. కానీ పురోగతి మాత్రం నత్తనడక నడుస్తోంది. పెద్దనోట్ల రద్దు సమయంలో నగరంలో పర్యాటకం తీవ్రంగా ప్రభావితమైంది. వీటన్నింటికీ తోడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్నప్పటికీ.. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఈ నగరాభివృద్ధికి సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కటారియా ఎదురీత
గత మూడు ఎన్నికల్లోనూ ఉదయపురి నుంచే ఎన్నికవుతూ వస్తున్న కటారియాకు ఈసారి ఎదురీత తప్పేట్లు లేదు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలతో పాటు అక్రమ గైడ్‌లు పర్యాటకులకు కుచ్చు టోపీ పెట్టడం అక్కడ సర్వసాధారణంగా మారింది. ఉదయ్‌పూర్‌లో నిండా సమస్యలే ఉన్నప్పటికీ కటారియా కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందే క్రమంలో రోడ్ల విస్తరణ , ఫ్లైఓవర్ల నిర్మాణం కారణంగా రోడ్లపై గుంతలు ఉన్నాయని ఆయన పేర్కొంటున్నారు. 

వ్యాస్‌.. తీస్‌ సాల్‌కే బాద్‌! 

 జాతీయ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్, కేంద్ర మాజీ మంత్రి, నాలుగు సార్లు ఎంపీ అయిన గిరిజా వ్యాస్‌ 33 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. 1985లో ఉదయ్‌పూర్‌ నుంచి అసెంబ్లీకి గెలిచారు. అనంతరం జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న గెహ్లాట్, పైలెట్‌ మధ్య విభేదాలు ముదిరితే.. వీరిద్దరికీ చెక్‌ పెట్టేందుకే.. గిరిజా వ్యాస్‌ను రంగంలోకి దించారని  విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


మోదీ, షాలకు సన్నిహితుడు

సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. రాష్ట్ర హోం మంత్రి గులాబ్‌చంద్‌ కటారియా మరోసారి తన అదృష్టాన్ని ఇక్కడినుంచే పరీక్షించుకోబోతున్నారు. నగరంలో నేరాలను అదుపు చేయలేకపోయారని ఆరోపణలొచ్చాయి. ప్రధాని, అమిత్‌ షాలకు కటారియా అత్యంత సన్నిహితుడు. వసుంధరా రాజేపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించిన మోదీ, షాలు ఒకానొక దశలో కటారియానే సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించాలని యోచించారు.  

మరిన్ని వార్తలు