బెన్ను దించారా..? దిగిపోయిందా?

1 Aug, 2016 21:24 IST|Sakshi
బెన్ను దించారా..? దిగిపోయిందా?

గాంధీనగర్: గుజరాత్లో ముఖ్యమంత్రి పదవికి అనూహ్యంగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లేఖ అందిందని, కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనేది పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. అయితే, వయోభారంతోనే తాను రాజీనామా చేసినట్లు ఆనందీబెన్ చెబుతున్నా దీని వెనుక వేరే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీనే ఆమెతో రాజీనామా చేయించినట్లు పార్టీలోని కొన్ని వర్గాలు అంటున్నాయి.

రాజీనామాకు కొన్ని గంటలు ముందు కొన్ని పథకాల ప్రకటనలు చేసిన ఆమె రాజీనామా అనూహ్యంగా ఎందుకు చేస్తారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, ఎవరినీ ఈ పీఠంపై కూర్చొబెడితే పార్టీకి లాభం చేకూరుతుందనే అంశంపై ఇప్పటికే ఆ పార్టీ ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారి ఆలోచనల్లో నలుగురు వ్యక్తులు సీఎం అభ్యర్థులుగా ఉన్నారు. వారిలో ముందు వరుసలో..
1. నితిన్ భాయ్ పటేల్: ఈయన పార్టీలోనే పటేల్ వర్గంలో ప్రముఖ నేత. ఆరెస్సెస్ నేపథ్యం కూడా ఉంది. అయితే, కొన్ని కులాలవారికి ఈయన గిట్టదు. ముఖ్యంగా పటేదార్లకు.
2.భూపేంద్రసింగ్ చుడాసమా: ప్రస్తుతం సీఎం స్థానానికి పోటీపడుతున్న వారిలో ఈయనే వయసులో పెద్ద. బీజేపీలో రాజపుత్ర కులానికి చెందిన నేతల్లో అగ్రగణ్యుడు. దళితుల విషయంలో కమిట్ మెంట్ ఉన్నవ్యక్తి. ఇతడికి ఆరెస్సెస్ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే, అతి తక్కువ ప్రొఫైల్ మాత్రమే ఉన్న ఈయన పార్టీని నడిపించలేరని అంటున్నారు.

3. సౌరబ్ పటేల్: ఈయన వద్ద ప్రస్తుతం రెండు ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. ఒకటి ఆర్థికశాఖ మరొకటి శక్తి వనరులు. రాష్ట్రంలోని విద్యుత్ రంగం పునర్నిర్మాణంలో ఈయన పాత్రే కీలకం అని పేరుంది. మచంఇ పాలకుడు అని కూడా ముద్రకలదు. దీంతోపాటు ప్రధాని మోదీకి కూడా అత్యంత దగ్గరగా ఉంటాడు.

4.విజయ్ రుపణి: విజయ్ రూపని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆయన వద్ద ట్రాన్స్ పోర్ట్, నీటి పంపిణీ శాఖలు ఉన్నాయి. జైన్ బనియ కులానికి చెందిన వ్యక్తి. ప్రధాని మోదీకి, అమిత్ షాకు అతి సమీపంగా ఉంటాడు. ఇక ఆరెస్సెస్ లో కూడా మంచి పేరుంది. మంచి రాజకీయ వ్యూహకర్త అనే పేరుతోపాటు మందిమార్బలాన్ని నడిపించగల సత్తా ఉన్న వ్యక్తి అని పేరుంది. అయితే, ప్రస్తుతం పలు శాఖలు నిర్వహిస్తున్న మంత్రులందరికన్నా తక్కువ అనుభవం ఉన్న వ్యక్తి అని అంటున్నారు.

మరిన్ని వార్తలు