హరియాణా: కాంగ్రెస్‌ వ్యూహం ఫలిస్తుందా?

24 Oct, 2019 18:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 90 సీట్లలో బీజేపీ 40 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 31, జన్నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) 10 సీట్లలో గెలిచాయి. ఏడుగురు స్వతంత్రులు, ఇతరులు ఇద్దరు విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం​ 46. దేవి లాల్ వారసుడిగా, బలమైన జాట్ ఓట్లు ఉన్న జననాయక్‌ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఇప్పుడు కింగ్‌ మేకర్‌గా మారారు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది కీలకంగా మారింది. దుష్యంత్ తమ వెంట రాకుంటే స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీని మళ్లీ అధికారంలోకి  రాకుండా చేసేందుకు కర్ణాటక వ్యూహాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది.

జేజేపీ-కాంగ్రెస్‌: కర్ణాటక మోడల్‌
జేజేపీని సంప్రదించిన కాంగ్రెస్‌.. దుష్యంత్‌కు హరియాణా సీఎం పదవిని కట్టబెట్టి బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్లాలని చూస్తోంది. కర్ణాటకలో జేడీఎస్‌తో జత కట్టినట్టుగానే హరియాణాలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. సైద్ధాంతిక పరంగా చూసినట్లయితే.. కాంగ్రెస్, జేజేపీకి హరియాణాలో భూపిందర్ సింగ్ హుడా కాంగ్రెస్‌కు బలమైన జాట్ నేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో దుష్యంత్ చౌతాలాతో విభేదించి కూటమిని చిక్కుల్లో పడేసే అవకాశం లేకపోలేదు.  కాంగ్రెస్‌ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

జేజేపీ-బీజేపీ: బలమైన కేంద్రం
కేంద్రంలో బీజేపీ బలంగా ఉండడంతో.. కేంద్రంలోని నాయకులు జోక్యం చేసుకుని దుష్యంత్‌ చౌతాలాకు హామీ ఇచ్చి బీజేపీ-జేజేపీ కూటమి ఏర్పాటు చేయవచ్చు. అయితే దుష్యంత్‌ సీఎం పదవిని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దుష్యంత్‌ తమతో జట్టు కట్టకున్నా స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

Poll
Loading...
మరిన్ని వార్తలు