ఆ వైరల్‌ వీడియోల వెనక ఎవరి హస్తం ?

6 Jun, 2019 16:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ మీ పాఠశాలలో విద్యార్థులను చితకబాదుతున్న ఆ టీచరెవరో చెప్పండీ, విద్యార్థులను కిందపడేసి తంతున్న టీచరెవరు? జుట్టు పట్టుకొని ఈడుస్తున్న ఆ టీచరెవరో చెప్పండంటూ రోజుకు ఒక్కటైన ఫోన్‌కాల్‌ నాకు వస్తోంది. ఆ ఫోనులో నన్ను కూడా నానా దుర్భాషలాడుతారు. ఆ వీడియోలు నకిలీవని, మా స్కూలుకు సంబంధించినవి కావని నెత్తీ నోరు మొత్తుకున్న ఎవరు నమ్మడం లేదు’ అని గుజరాత్‌లోని వల్సాద్‌ అనే కోస్తా నగరంలోని ‘ఆర్‌ఎంవీఎం దేశాయ్‌ విద్యాధామ్‌ స్కూల్‌’ ప్రిన్సిపాల్‌ మీడియా ముందు వాపోయారు. 2017 నుంచి ఆమెకు ఈ వేధింపులు ప్రారంభమయ్యాయి. 

ఆమె ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు ఫిర్యాదులు చేసినా, ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా లాభం లేకపోయింది. ఆ వీడియోలు సిరియా, ఈజిప్టు, చైనా, థాయ్‌లాండ్, టర్కీ దేశాల స్కూళ్లు, ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలని కనుగొన్న పోలీసులు ఈ ‘ఆర్‌ఎంవీఎం’ స్కూల్‌ పేరిట పనిగట్టుకొని ఎవరు పోస్ట్‌ చేస్తున్నారో ఇప్పటికీ కనుక్కోలేక పోతున్నారు. వాట్సాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు పోస్ట్‌ చేస్తున్నందున తాము కనుక్కోలేక పోతున్నామని వారు చెబుతున్నారు. ఈజిప్టులోని ఓ అనాథాశ్రయం పిల్లలను వాళ్ల సంరక్షకుడు కొడుతున్న వీడియోను మొట్టమొదటి సారిగా 2017లో ఆర్‌ఎంవీఎం’ స్కూల్‌ పేరిట పోస్ట్‌ అయింది. అప్పటి నుంచి అలాంటి వీడియోలు పది, పన్నెండ్‌ ఈ స్కూల్‌ పేరిట పోస్ట్‌ అయ్యాయి. అన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఏ దేశం నుంచి ముందుగా వచ్చాయో స్పష్టంగా పోలీసులు తెలుసుకున్నప్పటికీ స్కూల్‌ పేరిట ఎవరు పోస్ట్‌ చేశారో మాత్రం కనుగొనలేక పోతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలు వాట్సాప్‌ నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు