ఉత్తరాఖండ్‌లో విజయం ఎవరిది?

17 Jan, 2017 18:05 IST|Sakshi
ఉత్తరాఖండ్‌లో విజయం ఎవరిది?

న్యూఢిల్లీ: రానున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందా? ఆయన ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా పడగొట్టిన భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందా? సుప్రీంకోర్టు తీర్పు కారణంగా తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రావత్‌ గత ఆరు నెలలుగా పడిపోతున్న తన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోగలరా? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషోర్‌ ఉపాధ్యాయ్‌ కొనసాగుతున్న అంతర్యుద్ధాన్ని పరిష్కరించుకోగలరా? ఐక్యతా రాగాన్ని వినిపించగలరా?

కిషోర్‌ ఉపాధ్యాయ్‌తో పొత్తు పొసగకపోయినా హరీష్‌ రావత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం మద్దతును సాధించగలిగారు. హరీష్‌ రావత్‌ అంతటి పార్టీ నాయకుడు మరొకరు లేకపోవడంతో పార్టీ అధిష్టానం ఈసారి కూడా ఆయన్ని నమ్ముకొనే ఎన్నికల బరిలోకి దిగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో రావత్, ఉపాధ్యాయ్‌ ఒక అంగీకారానికి రావాలని, త్వరగా విభేదాలు పరిష్కరించుకోవాలని అధిష్టానం ఇద్దరికి సూచించినట్లు తెల్సింది. పార్టీలోనూ పాలనలోనూ రావత్‌ నిరంకుశ వ్యవహార శైలి పట్ల తాము నిజంగా విసిగిపోయామని, అయినా ఆయన నాయకత్వంలో తాము ముందుకు నడవడం తప్ప మరో మార్గం లేదని ఆయనతో విభేదిస్తున్న పార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఉపాధ్యాయ్‌ గెలవాలన్నా ఆయన రావత్‌పై ఆధారపడాల్సిందేనని వారు అంటున్నారు.

ఠాకూర్‌ వర్గానికి చెందిన రావత్‌ నిరంకుశ వైఖరి తెలిసే ఆయనకు ప్రత్యామ్నాయ శక్తిగా ప్రమోట్‌ చేసేందుకే బ్రాహ్మణ కులానికి చెందిన ఉపాధ్యాయ్‌ని పార్టీ అధిష్టానం నియమించింది. ఎంత ప్రోత్సహించినా రావత్‌ స్థాయికి ఆయన ఎదగలేక పోయారు. రావత్‌ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా పరువును దిగజార్చుకున్న భారతీయ జనతా పార్టీ కాశ్మీర్‌ సర్జికల్‌ రైట్స్‌ ద్వారా, పెద్ద నోట్ల రద్దు ద్వారా తన ప్రతిష్టను, ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రతిష్టను పెంచుకుంది. అందుకనే రానున్న ఎన్నికల్లో మోదీ ప్రతిష్టపైనే ఆధారపడి ఎన్నికల బరిలోకి దిగుతోంది.

నిరంకుశ వైఖరి, అవినీతి ఆరోపణల కారణంగా గత ఆరు నెలల కాలంలో రావత్‌ ప్రతిష్ట కూడా బాగానే దెబ్బతిన్నది. దానికితోడు ఉపాధ్యాయ్‌తోనున్న విభేదాలను పరిష్కరించుకోకపోతే మరింత నష్టం. తాను గతంలో పోటీచేసి ఓడిపోయిన తెహ్రీ సీటును ఉపాధ్యాయ్‌ కోరుతున్నారు. 2012 ఎన్నికల్లో అక్కడి నుంచి ఉపాధ్యాయ్‌పై  కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి దినేష్‌ ధనాయ్‌ విజయం సాధించారు.

ఆయన్ని రావత్‌ తన మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఉద్దేశపూర్వకంగానే రావత్‌ తనను ఓడించారని ఉపాధ్యాయ్‌ ఆరోపిస్తు వచ్చారు. ఇప్పుడు కూడా ఆ సీటును తనకే ఇవ్వాలని ఉపాధ్యాయ్‌ కోరుతున్నారు. అందుకు రావత్‌ నిరాకరిస్తున్నారు. ఇలాంటి విభేదాల వల్ల ఇంతవరకు పార్టీ అభ్యర్థుల ఎంపిక ఖరారు కాలేదు. ఇద్దరు మధ్య ఐక్యత కుదిరి కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలోకి వెళితే ఈసారి కూడా పార్టీదే విజయమని కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ నాయకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు