గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా: నిర్మలా సీతారామన్

25 Jun, 2020 18:57 IST|Sakshi
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫోటో)

చైనా దిగుమతులు నిషేధం నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

దిగుమతులు తప్పు కాదు

పారిశ్రామిక వృద్ది, ఉద్యోగావకాశాలు

సాక్షి,  చెన్నై: చైనా దిగుమతుల నిషేధంపై తీవ్ర చర్చోపచర్చలు నడుస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందుబాటులో లేని, మన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం తప్పు కాదని ఆమె వెల్లడించారు. స్వావలంబన భారతదేశం (ఆత్మనిర్బర్ భారత్ అభియాన్) అంటే దిగుమతులు అస్సలు చేయకూడదని కాదు. పారిశ్రామిక వృద్ధికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరమైన దిగుమతులు చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. వృద్ధిని పెంచేందుకు దిగుమతి చేసుకోవడంలో తప్పు లేదు కానీ, గణేష్ విగ్రహాలను కూడా చైనా నుండే ఎందుకు దిగుమతి చేసుకోవాలని ఆమె ప్రశ్నించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకంపై తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ గా మాట్లాడిన  సీతారామన్  ఈ వ్యాఖ్యలు చేశారు.  (చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా?)

ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా సాంప్రదాయకంగా స్థానికంగా మట్టితో చేసిన గణేశ విగ్రహాల కొనుగోలుకు బదులుగా వాటిని కూడా చైనా నుండి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు. మనం తయారుచేసుకోలేమా..ఇలాంటి పరిస్థితి ఎందుకో ఆలోచించాలన్నారు. ఆఖరికి సబ్బుపెట్టె, ప్లాస్టిక్ వస్తువులు, పూజకు ఉపయోగించే అగర్ బత్తీలాంటి మనం ప్రతి రోజూ వాడే గృహోపకరణాలను దిగుమతి చేసుకోవడం స్వావలంబనకు తోడ్పడుతుందా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేకించి ఇటువంటి ఉత్పత్తులను భారతీయ సంస్థలు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్‌ స్థానికంగా తయారుచేసినప్పుడు మాత్రమే  దేశ స్వావలంబన సాధ్యపడుతుందన్నారు.  (బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు)

దిగుమతులు తప్పు కాదు, అవి ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ఉపాధి అవకాశాలు, వృద్ధి లాంటి ప్రయోజనాలను తీసుకురాలేని దిగుమతులు స్వావలంబనకు, భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడవని పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే అందుబాటులో ఉన్న వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితి మారాలి. ఆత్మ నిర్బర్ అభియాన్ వెనుకున్న స్వయం ప్రతిపత్తి ఆలోచన ఇదేనని ఆమె పునరుద్ఘాటించారు. ఈ సందర్బంగా గత ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. మోదీ అయ్య (సార్) అంటూ తమిళంలో ప్రసంగించారు. అలాగే జూన్ 15న లద్దాఖ్‌లో మరణించిన 20 మంది సైనికుల్లో ఒకరైన తమిళనాడుకు చెందిన హవల్దార్ కె పళనికి ఆమె నివాళులర్పించారు.  

మరిన్ని వార్తలు