ఈ సిగరెట్ల’పైనే ఎందుకు నిషేధం?

19 Sep, 2019 19:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇ-సిగరెట్లపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం నాడు ప్రకటించిన విషయం తెల్సిందే. అంటే, పొగను ఉత్పత్తి చేసే పరికరాలను దేశంలో తయారు చేయడం, వాటిని దిగుమతి చేసుకోవడం లేదా అమ్మడం ఇక మీదట నిషేధం. దేశంలో ధూమపానానికి బానిసలైన వారిని, ఆ బానిసత్వం నుంచి తప్పించి వారితో ధూమపానాన్ని మాన్పించాలనే ఉద్దేశంతో తొలుత ఈ ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ లక్ష్యం నెరవేక పోగా, విద్యార్థులు, యువత ఎక్కువగా ఈ ఎలక్ట్రానిక్‌ సిగరెట్లకు ఎక్కువ అలవాటు పడడం మొదలైంది. 

చదవండి: ఇ–సిగరెట్లపై నిషేధం

అమెరికాలో హైస్కూల్‌ విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులు కూడా ఇ-సిగరెట్లకు ఎక్కువ బానిసలవుతున్నారని అక్కడి నుంచి అందిన డేటా తెలియజేస్తోందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. గత 30 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మొదటిసారి యువత ఇ-సిగరెట్లకు అలవాటు పడినట్లు అక్కడి డేటా తెలియజేస్తోంది. పొగాకుతో చేసిన రెగ్యులర్‌ సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్లు వస్తాయని, ఇ-సిగరెట్ల వల్ల ఎలాంటి జబ్బులు రావని చెప్పడమే కాకుండా వాటిలో రకరకాల ఫ్లేవర్లు తీసుకరావడంతో ఈ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలోనే విస్తరించింది. పొగాకు సిగరెట్ల వల్ల మానవులకు క్యాన్సర్‌ వస్తుందని వైద్యులు తేల్చి చెప్పడానికి కొన్ని దశాబ్దాల సమయం పట్టింది. అదే ఇ-సిగరెట్ల వల్ల ఎలాంటి జబ్బులు రావని వైద్యులు తేల్చి చెప్పడానికి ఎక్కువ కాలం పట్టక పోవడానికి కారణాలను ఊహించవచ్చు. మార్కెట్‌ వర్గాలు ఇప్పటి వరకు వారి ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకోగలిగాయి. 

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం పెరగడమో, మరో కారణమో తెలియదుగానీ ఇ-సిగరెట్ల వల్ల కూడా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందంటూ వరుసగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకొని ఉంటుందనడంలో సందేహం లేదు. మరి అంతే ప్రమాదకరమైన పొగాకు సిగరెట్లను నిషేధించే దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? పొగాకు సిగరెట్లతో క్యాన్సర్లు వచ్చినా ఫర్వాలేదుగానీ ఇ-సిగరెట్ల వల్ల రాకూడదనే ఉద్దేశమా ? అయితే ఎందుకు ? దీనికి సమాధానం వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. 

దేశంలో సిగరెట్ల పరిశ్రమ 11.79 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడంతోపాటు 4.57 కోట్ల మందికి ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బడ్డీ కొట్లు నడవడానికి సిగరెట్లే ఎక్కువగా తోడ్పడుతున్నాయి. పొగాకు పంటలపై లక్షలాది మంది రైతులు కూడా ఆధారపడి బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇ-సిగరెట్ల పరిశ్రమ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ దశలో చర్య తీసుకోకపోతే ఆ పరిశ్రమ విస్తరించి పొగాకు సిగరెట్ల పరిశ్రమ ఉనికిని దెబ్బతీసే అవకాశం ఉందని, తద్వారా కోట్లాది మందికి ఉపాధి పోతుందని భావించే కేంద్రం ‘నిషేధం’ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. పొగాకుతో పోలిస్తే గంజాయితో తక్కువ నష్టాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కనుక గంజాయిని చట్టబద్ధం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నా ఆ దిశగా చర్య తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సాహసించడం లేదు. 

మరిన్ని వార్తలు