వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?

2 May, 2020 15:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌ విధించిన అయిదు వారాల తర్వాత వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతించింది. పొరుగు రాష్ట్ర సరిహద్దులో చిక్కుకున్న వలస కార్మికులు బుక్కెడు అన్నం కోసం ఎండలో గంటలకొద్దీ క్యూలో నిలబడుతూ, పొలీసు లాఠీ దెబ్బలు తింటూ మగ్గుతున్నప్పుడు.. ఆకలితో చచ్చేకంటే సొంతూరులో కలో, గంజో తాగి బతుకుదామని వందల కిలోమీటర్ల దూరం కాలి నడక బయల్దేరినప్పుడు కనికరించని కేంద్రం మేల్కొనడానికి ఎందుకు అయిదు వారాలు పట్టింది. దేశంలో కరోనా కేసులు వందల్లో ఉన్నప్పుడు పట్టించుకోని కేంద్రం కేసుల సంఖ్య 30 వేలు దాటాకా ఎలా మేల్కొంది? అసలు వలస కార్మికుల సమస్య గురించి ముందుగానే ఎందుకు ఆలోచించలేదు? (తెరచుకున్న షాపులు.. ఇదంతా ప్రహసనం!)

సామాజిక దూరాన్ని పట్టించుకోకుండా వేలాది మంది వలస కార్మికులు ముంబై నగరంలోని బాంద్రా రైల్వేస్టేషన్‌ ముట్టడించినప్పుడైనా కేంద్రం స్పందించి ఉండాల్సింది. అప్పుడే వారికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో వారి గమ్యస్థానాల్లో కరోనా పరీక్షలు నిర్వహించి రోగులకు ప్రత్యేక ఏర్పాటు చేసి ఉండాల్సింది. వాస్తవానికి దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి 24వ తేదీ కన్నా ముందే వలస కార్మికులను వారి గమ్యాలకు పంపించి ఉండాల్సింది. జనవరి 30వ తేదీన దేశంలో తొలి కరోనా కేసు బయటపడగా లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి 50 రోజులకుపైగా పట్టింది. వలస కార్మికుల విషయం పట్టించుకొని ఉంటే నేడు ఇంతటి దారుణ పరిస్థితులు దాపురించేవి కావు. (అత్యధిక పరీక్షలతోనే కరోనా కట్టడి )

అప్పటికే దేశంలో ఆరు కోట్ల మందికి పైగా వలస కార్మికులు ఉన్నారని, వారిలో 99 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో దినసరి వేతనంపై పని చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. పరిస్థితి తీవ్రత అర్థం అయ్యాక సొంత కార్మికులతోపాటు వలస కార్మికులను కూడా ఆదుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఉచిత సలహా ఇచ్చింది. సొంత కార్మికులు రేషన్‌తోపాటు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మిక కుటుంబాలకు కేవలం 500 రూపాయలను మాత్రమే ప్రకటించాయి. ఆ సొమ్ములు కూడా సరిగ్గా అందలేదు. దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను ‘స్ట్రాండెడ్‌ వర్కర్స్‌ నెట్‌వర్క్‌’ సర్వే చేయగా కేవలం 6 శాతం మందికి మాత్రమే ఆహారం దొరకుతోందని తేలింది. (‘శృతి హాసన్‌ బెస్ట్‌ డ్రామా క్వీన్‌’)

సొంత కార్మికులనే ఆర్థికంగా ఆదుకోలేక సతమతమవుతున్న రాష్ట్రాలు వలస కార్మికులను గాలికొదిలేయడంతో వారంతా చచ్చినా సరేనంటూ సొంతూళ్లకు పయనమయ్యారు. వలస కార్మికుల స్థితిగతులపై పాటలు, కవితలు ప్రతి ప్రాంతీయ భాషల్లోనూ సోషల్‌ మీడియా ద్వారా మారుమోగడం ప్రారంభమయ్యాయి. తెలుగులో మహాకవి శ్రీశ్రీ రాసిన ‘కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని బయల్దేరిన బాటసారికి ఎంత కష్టం’ సందర్భానుచితంగా మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే కేంద్రం స్పందించినట్లు తెలుస్తోంది. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం)

మరిన్ని వార్తలు