ఎందుకీ దుమ్ము తుపాన్లు ?

3 May, 2018 22:04 IST|Sakshi

దుమ్ము, ధూళితో కూడిన బలమైన ఈదురు గాలులు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష బీభత్సానికి ఉత్తర భారతంలో పలు రాష్ట్రాలు గజగజ వణికిపోయాయి. వందమందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ అరుదైన వాతావరణ పరిస్థితులకు చాలా కారణాలున్నాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. పశ్చిమాన నెలకొన్న వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడిన తుపాను ప్రభావం, తూర్పు నుంచి వీస్తున్న తేమతో కూడిన గాలులతో పాటుగా ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతల వల్ల దుమ్ము తుపాన్లు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ అధికారి కులదీప్‌ శ్రీవాస్తవ తెలిపారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి ఆకస్మికంగా ధూళి మేఘాలు ఆవృతమై, అవి ఢిల్లీ వరకు విస్తరించాయి. 

ఆ తర్వాత కొన్ని గంటల సేపు నానా బీభత్సం సృష్టించాయి. ఈ స్థాయిలో కొన్ని రాష్ట్రాల మీదుగా దుమ్ము, ధూళితో కూడిన మేఘాలు విస్తరించడం చాలా అరుదుగా జరిగే విషయమని స్కైమెట్‌ వెదర్‌ చీఫ్‌ మహేశ్‌ పాలవట్‌ అభిప్రాయపడ్డారు. దుమ్ముతో కూడిన ఈదురుగాలులతోపాటుగా పశ్చిమ హర్యానా, ఉత్తర రాజస్థాన్‌లలో ఏర్పడిన తుపాన్‌ మేఘాల కారణంగా కురిసిన వర్షాలు ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయని మహేష్‌ తెలిపారు. రాజస్థాన్‌లో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ఎడారి ప్రాంతంలో ఉపరితలంపై తేమ శాతం తగ్గి దుమ్ము, ధూళిపైకి ఎగిరి మేఘాలుగా విస్తరించడం వల్ల ఈదురుగాలులు వీయడం,  వర్షాలు కురవడం జరిగింది. 

ఈ రకమైన దుమ్ము తుపాన్లు ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో తరచుగా సంభవిస్తూ ఉంటాయి. కానీ మన దేశంలో అత్యంత అరుదుగా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎండలు మండిపోతూ ఉండడంతో కొన్ని రాష్ట్రాల్లో క్యుమలోనింబస్‌ మేఘాలు ఏర్పడి వర్ష బీభత్సాన్ని సృష్టించాయి. రుతుపవనాలు రావడానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో ఉత్తర భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సర్వసాధారణంగా ప్రతీ ఏడాది కురుస్తూనే ఉంటాయి. అయితే దుమ్ముతో కూడిన తుపాన్లు మాత్రం ఏడాది ఏడాదికి వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులకు ఒక సంకేతంలా ఉన్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
  

 
 

మరిన్ని వార్తలు