ఆ అమ్మాయి, ఆ రాయి ఎందుకు విసిరిందీ?

9 May, 2017 16:51 IST|Sakshi



శ్రీనగర్‌:
అది ఏప్రిల్‌ 24వ తేదీ. మంగళవారం మధ్యాహ్నం. 21 ఏళ్ల ఫుట్‌బాల్‌ కోచ్‌ అఫ్షాన్‌ ఆసిక్‌ తాను శిక్షణ ఇచ్చే దాదాపు 15 మంది విద్యార్థినులను తీసుకొని కోఠి బాగ్‌ నుంచి టూరిస్ట్‌ రిసెప్షన్‌ సెంటర్‌లో ఉన్న ఫుట్‌బాల్‌ మైదానానికి బయల్దేరారు. వారు రోజూ వెళ్లేది అదే దారిలోనే. ఫుట్‌బాల్‌ మైదానికి చేరుకోవడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది. ఇంతలో ఆ వీధిలో ఓ పక్క నుంచి అల్లరి మూక రాళ్లను రువ్వడం ప్రారంభించింది. అలా రాళ్లు రువ్వే అల్లరి మూకలను ఆసిక్‌ అనేక సార్లు చూశారు. వారెందుకు రాళ్లు రువ్వుతారో, వారి వెనక ఎవరున్నారో కూడా ఆమె ఎన్నడూ పట్టించుకోలేదు. విద్యార్థినులకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇవ్వడమే ఆమె ఏకైక లక్ష్యం.

ఆ రోజు కూడా శిక్షణ ఇవ్వడం కోసమే విద్యార్థినులను తీసుకొని వెళుతున్నారు. దారిలో అల్లరి మూక రాళ్లు రువ్వుతూ కనిపించింది. ప్రతాప్‌ పార్క్‌ నుంచి చుట్టూ తిరిగి వెళ్దామని చెప్పి తన టీమ్‌ను ఆసిక్‌ అటు మళ్లించింది. ఇంతలో కశ్మీర్‌ పోలీసులు అల్లరి మూకపైకి భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. వాటి నుంచి తప్పించుకుంటూ ఆసిక్‌ టీమ్‌ మైదానం వైపు వెళ్లింది. అక్కడ ఓ పోలీసు అధికారి ఆసిక్‌ టీమ్‌లోని అమ్మాయిలను పిలిచి అసభ్యంగా మాట్లాడారు. ఓ అమ్మాయి మీద చేయి కూడా చేసుకున్నారు. ఆసిక్‌ వెళ్లి తాము ఎవరమో, ఎక్కడికి వెళుతున్నామో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ పోలీసు అధికారి వినిపించుకోకుండా తక్షణం అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా బూతులు తిట్టారు.

‘మీరు యూనిఫారమ్‌లో ఉన్నారు కనుక మేము మీపై చేయిచేసుకోలేం. కాస్త ఇటువైపు వీధిలోకి రండీ, మీ సంగతి చెబుతాం’ అని ఆసిక్‌ ఓ పోలీసు అధికారిని హెచ్చరించి తన మానాన తన టీమ్‌ను తీసుకొని ముందుకెళ్లింది. అయినప్పటికీ పోలీసు అధికారి దూషిస్తుండడంతో అనుకోకుండానే క్షణికావేశంలో ఆసిక్‌ రోడ్డుపైనున్న ఓ రాయిని అందుకొని బలంగా పోలీసులపైకి రువ్వింది. స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్న ఆసిక్‌ శిక్షకులు కూడా రాళ్లందుకొని పోలీసులపైకి రువ్వారు. ఈ ఫొటోలు దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. మొదటిసారి విద్యార్థినులు రాళ్లు రువ్వుతూ కనిపించారన్న శీర్షికలతోని వాటికి విస్తత ప్రచారం లభించింది.  ఆసిక్‌ రాయి విసురుతున్న ఫొటోను రాయ్‌టర్‌ సంస్థ ప్రముఖంగా ప్రచురించడంతో అంతర్జాతీయంగా ఆమె ఫొటోకు ప్రాచుర్యం లభించింది.

ఈ నేపథ్యంలో ఆసిక్‌ నాటి సంఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ ‘నాకు రాళ్లు రువ్వాలనే ఆలోచన అప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. పైగా రాళ్లు రువ్వేవారిని తీవ్రంగా వ్యతిరేకించేదాన్ని. 21 ఏళ్లుగా రాళ్లు రువ్వుతున్నా రాని స్వాతంత్య్రం ఎప్పటికీ రాకపోగా, కశ్మీర్‌ పరిస్థితి మరింత దిగజారుతుందని నచ్చచెప్పేదాన్ని. పాకిస్తాన్‌ కూడా మా స్వాతంత్య్రాన్ని కోరుకోవడం లేదని, మా భూభాగాన్ని కోరుకుంటోందని మాకు తెలుసు. ఇంటి నుంచి బయటకు రావాలంటే కుటుంబ సభ్యుల ఫోన్లతో విసిగిపోతున్నాం. గంటగంటకు ఫోన్‌చేసి ఎక్కడున్నావు. ఏం చేస్తున్నావు, ఎప్పుడొస్తావు? లాంటి ప్రశ్నలతో విసిగిస్తుంటారు.

అభద్రతా భావంతోని బతుకుతున్న ఇలాంటి సందర్భాల్లో మహిళలం, అందులో విద్యార్థినులమని చెప్పినా పట్టించుకోకుండా పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తే మాకు కోపం రాదా? కానీ రాళ్లు రువ్వడం విద్యార్థులకు కూడా అలవాటు కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాళ్లురువ్వే అల్లరి మూకలను మళ్లీంచేందుకు రాష్ట్రంలో విస్తతంగా క్రీడలను ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ సర్కార్‌ను కోరుతున్నాను’ అని చెప్పారు. డిగ్రీ చదివిన ఆసిక్‌ పాటియాలాలోని ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా సంస్థలో ఫుట్‌బాల్‌ శిక్షణ పొందారు.

మరిన్ని వార్తలు