ఒక్కరు కూడా ఓటు వేయలేదు!

21 Oct, 2019 15:18 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని నందూర్బార్‌ జిల్లా మనిబేలి గ్రామస్థులు సోమవారం నాటి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో 135 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక్కరు కూడా ఓటు వేయలేదు. వీరు ఈ నాటి పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నా గ్రామానికి కరెంట్, రోడ్డు సౌకర్యం లేకపోవడమే పోలింగ్‌ బహిష్కరణకు కారణం. దేశంలో నూటికి నూరు శాతం విద్యుత్‌ సదుపాయాన్ని సాధించామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్ర విద్యుత్‌ బోర్డు దృష్టిలో ఈ గ్రామం ఉన్నప్పటికీ విద్యుత్‌ సదుపాయం లేకపోవడం నిజంగా శోచనీయం.

ఇంకా రాజకీయ నాయకుల వెంటబడి కరెంట్‌ కావాలి, రోడ్డు కావాలి అంటూ తిరిగే ఓపిక తమకు లేదని, ఓ ఆఖరి ప్రయత్నంగా అసెంబ్లీ పోలింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించామని నటర్వ్‌ భాయ్‌ టాడ్వీ అనే 60 ఏళ్ల వృద్ధుడు తెలిపారు. ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌  యోజన’ కింద రెండేళ్ల క్రితం తమ గ్రామానికి 8 కిలోమీటర్ల రోడ్డు మంజూరు అయ్యిందని, అయితే అది ఇప్పటికీ కాగితాలకే పరిమితం అయిందని గ్రామస్థులు తెలిపారు. ఓ పక్క అడవి ప్రాంతం, మరో పక్క నర్మదా నడి డ్యామ్‌ బ్యాక్‌ వాటర్‌ ఉన్న కారణంగా ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని తెల్సింది. గిరిజనులు ఎక్కువగా ఉన్న నదూర్బార్‌ జిల్లాలో ఈ గ్రామం ఉండడం కూడా ఓ శాపంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్‌ వన్‌ పరిధిలోకి వచ్చే అక్కల్‌కువా తహిసిల్‌లో ఈ గ్రామం ఉంది. (చదవండి: మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌ విశేషాలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా