‘మోదీ వర్సెస్‌ రాహుల్‌’ అని ఎందుకు?

26 Dec, 2018 17:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం ఆశ కేంద్రంగా కాకుండా భయం కేంద్రంగా జరుగుతాయి’ అని పార్లమెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు, కేంద్రం అనధికార ప్రతినిధి స్వపన్‌ దాస్‌ గుప్తా డిసెంబర్‌ 11వ తేదీన వ్యాఖ్యానించారు. ‘సుస్థిర పాలన లేక సంకీర్ణ పాలన’ అన్న అంశం చుట్టూ ఎన్నికల ప్రచారం ఉంటుందని అని ఉంటే సబబుగా ఉండేదేమో! ఆశ కాకుండా భయం అని గుప్తా వ్యాఖ్యానించడంలో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? 2014లో జరిగిన సార్వత్రక ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందనే ‘ఆశ’తోనే ప్రజలు ఆయన పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. 2014 ఎన్నికల్లో మోదీ కూడా అభివృద్ధి మంత్రాన్నే జపించారు.

నాడు ఆయన ఎన్నికల నినాదం ‘సబ్‌ కా వికాస్‌ సబ్‌కా సాత్‌’ దాదాపు అన్ని వర్గాలకు నచ్చింది. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ అభివృద్ధి గురించే ఎక్కువగా మాట్లాడారు. కేంద్ర స్థాయిలో తాను ప్రవేశపెట్టిన పలు పథకాల గురించి ప్రస్తావించారు. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం ఎన్నికల్లో మోదీ అభివృద్ధి అంశాన్ని పక్కన పడేసి రాహుల్‌ గాంధీ, ఆయన కుటుంబ వారసత్వమే లక్ష్యంగా ఎక్కువ మాట్లాడారు. వచ్చే ఎన్నికలు ‘భయం’ కేంద్రంగా జరుగుతాయంటే ముస్లింల నుంచి పాకిస్థాన్‌ నుంచి ముప్పు పొంచి ఉందనే భయం కలిగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని మోదీ పార్టీ యోచిస్తుందా? లేక రాహుల్‌ గాంధీ నాయకత్వాన సంకీర్ణ ప్రభుత్వం వస్తే అస్థిరత్వం కారణంగా ముప్పు పెరుగుతుందన్నది ఉద్దేశమా!

ఏది ఏమైనా నరేంద్ర మోదీ వర్సెస్‌ రాహుల్‌ గాంధీగా వచ్చే ఎన్నికలు జరుగుతాయనడంలో సందేహం లేదు. బీజేపీ, నరేంద్ర మోదీ కోరుకుంటున్నది కూడా అదే. మోదీ హయాంలో దేశం ఆశించిన అభివృద్ధి జరగలేదు. పైగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. ఈ కారణంగా అభివృద్ధి మంత్రాన్ని మళ్లీ అందుకునే సాహసం మోదీ చేయలేరు. అందుకనే రాహుల్‌ వర్సెస్, తానే ప్రచార లక్ష్యం కావాలని ఆయన కోరుకుంటున్నారు. జాతీయ పత్రికలన్నీ కూడా మోదీకి అనుకూలంగా మోదీ వర్సెస్‌ రాహుల్‌ అనే జపిస్తున్నాయి. వ్యక్తిగతంగా మోదీకున్న ప్రజాకర్షణ రాహుల్‌ గాంధీకి ఇంకా రాలేదు. ఆ విషయం ఆయన తల్లి సోనియా గాంధీయే కాకుండా కాంగ్రెస్‌ నాయకత్వానికి తెలుసు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ విజయాల స్ఫూర్తిగా కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ లేదా మోదీ జరగాలని కాంగ్రెస్‌ ఆశిస్తోంది.
 
రాహల్‌ వర్సెస్‌ మోదీ అన్న కేంద్రంగా ఎన్నికల ప్రచారం జరిగితే మోదీ పట్ల ఉన్న ప్రజాకర్షణ, అభిమానం ముందు రాహుల్‌ కొట్టుకుపోతారన్నది మోదీ, ఆయన పార్టీ విశ్వాసం. మరి అప్పుడు ‘భయం’ ఏమవుతుంది? రాహుల్‌ సంకీర్ణ ప్రభుత్వమొస్తే మైనారిటీలైన ముస్లింలు బలపడుతారన్న భయమా? వారిని మెప్పించే నిర్ణయాలను తీసుకుంటారంటూ హిందువులను భయపెట్టడమా!? మన ఇరుగుపొరుగునున్న ఉత్తర, పశ్చిమ దేశాలతో పోలిస్తే 793 మంది ఎంపీలు, 30 మంది ముఖ్యమంత్రులు, 80 కోట్ల మంది ఓటర్లు కలిగిన మనది ఇప్పటికీ ప్రజాస్వామ్య, బహుళ సమాజ దేశమే. అందుకనే 1989 నుంచి 2014 ఎన్నికల వరకు వ్యక్తి ప్రధానంగా కాకుండా పార్టీ ప్రధానంగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. 

మరిన్ని వార్తలు