పండిట్లలో ఆ ఆగ్రహం ఎందుకు?

12 Aug, 2019 13:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లో మిలిటెంట్ల అరాచకాలను, హింసాకాండను తట్టుకోలేక కశ్మీర్‌ నుంచి చెల్లా చెదురై నేడు దేశవ్యాప్తంగా స్థిరపడిన పండిట్ల కుటుంబాలు కశ్మీర్‌ పట్ల కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణను ఎత్తివేయడం సబబేనని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంతకాలానికి తమ ప్రతికారం తీరిందని, తమకు న్యాయం దక్కిందని వారు అంటున్నారు. ప్రతికారాత్మక వాంఛతోనే వారిలో ఎక్కువ మంది కేంద్రం నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. వారిలో ఎందుకు అంత ఆగ్రహం పేరుకుపోయింది?

జమ్యూ కశ్మీర్‌లో 1989 నుంచి మిలిటెంట్‌ కార్యకలాపాలు పెరిగిపోయాయి. వారికి హిందువులైన పండిట్లంటే అసలు పడలేదు. వారి కుటుంబాలు లక్ష్యంగా మిలిటెంట్లు దాడులు జరిపారు. 1990వ దశకంలో జరిగిన ఈ దాడుల్లో 219 మంది మరణించినట్లు 2010లో జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఓ నివేదికనే వెల్లడించింది. నాడు పండిట్ల ఇళ్లను తగులబెట్టారు. దోచుకున్నారు. వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చెల్లా చెదురుగా పారిపోయారు. నాడు కశ్మీర్‌ నుంచి పారిపోయిన ఓ పండిట్‌ కుటుంబానికి చెందిన ఆషిమా కౌల్‌ కేంద్రం నిర్ణయాన్ని హర్షించారు. అమె ప్రస్తుతం జమ్మూలో స్థిరపడి వివిధ సామాజిక వర్గాల ఐక్యతకు కృషి చేస్తున్నారు. ఎట్టకేలకు కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని ఫరిదాబాద్‌లో స్ధిరపడిన అముల్‌ మాగజైన్‌ చెప్పారు. గురుగ్రామ్‌లో స్థిరపడిన మీనాక్షి భాన్‌ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికి కశ్మీర్‌లోనే స్థిరపడిన పండిట్‌ కుటుంబాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేస్తున్నాయి.

ఇది అప్రజాస్వామికం
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం, ఏకపక్షమని పండిట్లు, డోగ్రాలు, సిక్కులతో కూడిన ఓ 65 మంది సభ్యుల బృందం విమర్శించింది. ఈ మేరకు వారు ఓ ఖండనను విడుదల చేశారు. దానిపై సంతకాలు చేసిన వారిలో ప్రముఖ కార్డియోలాజిస్ట్‌ ఉపేంద్ర కౌల్, రిటైర్‌ ఏర్‌ వైస్‌ మార్షల్‌ కపిల్‌ కాక్, జర్నలిస్టులు ప్రదీప్‌ మాగజైన్, శారదా ఉగ్రాలతోపాటు పలువురు విద్యావేత్తలు సంతకాలు చేశారు. 1949లో రాజ్యాంగ పరిష్యత్తుతో సమగ్రంగా చర్చించే 370 ఆర్టికల్‌ తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ ఆమోదం లేకుండా ఎలా ఏకపక్షంగా ఎత్తివేస్తారని వారు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు