‘ముస్లింలు హిందూ దేవాలయాలకు ఎందుకు వస్తున్నారు’

28 May, 2018 20:15 IST|Sakshi
రాజ్‌కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

డెహ్రాడూన్ : ముస్లింలు హిందూవుల దేవాలయాలకు ఎందుకు వస్తున్నారని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ తుక్రాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ముస్లింలు హిందూవులను మసీద్‌, మదార్సాలోకి రానివ్వరు అందుకే హిందూవులు మసీద్‌లోకి వెళ్లరు. ముస్లింలు హిందూ దేవాలయాలకు ఎందుకు వస్తున్నారు’ అని ప్రశ్నించారు. ఆదివారం రాంనగర్‌లోని దేవాలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముస్లింలు దేవాలయ ప్రాంగణంలోకి రావడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు దురుద్దేశంతో హిందూ దేవాలయాలకు వస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

మతమార్పిడి, లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా హిందూసేన కార్యకర్తలు పోరాడుతున్నారని, పోలీసు అధికారులు మాత్రం ఏం చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని రామ్‌ నగర్‌లో పోలీసు అధికారి గంగాదీప్‌ సింగ్‌ హిందూ యువకుల దాడినుంచి  ముస్లిం యువకుడిని కాపాడిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగి రెండు రోజులు కూడా కాకముందే ఈ వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యేపై విమర్శలు వెలువెత్తున్నాయి.

మరిన్ని వార్తలు